Health: ఈ గింజలను తక్కువ అంచనా వేస్తున్నారా.. వీటిని ఇలా తింటే అద్భుతాలే
కొవిడ్ కల్లోలం తరువాత ప్రజలకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెరుగుతోంది. జంక్ ఫుడ్ వినియోగం కాస్త తగ్గుతూ, చాలామంది ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి సారిస్తున్నారు. ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పని ఒత్తిడితో బీపీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నవారు పాతకాలం నాటి ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం..

చాలా మంది తమ డైట్ లో భాగంగా అవిసెలు, చియా, సబ్జా లాంటి గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారు. రాత్రి పూట వాటిని నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగడం చేస్తున్నారు. అయితే, ఇది ఆరోగ్యకరమే అయినా, అన్ని గింజలనూ ఒకే విధంగా తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆ గింజల పూర్తి పోషకాలు అందాలంటే వాటిని సరైన విధంగా తీసుకోవాలి. ఏ గింజలను ఎలా వాడాలో చూద్దాం.
గుమ్మడి గింజలు: ఒకప్పుడు పెద్దగా పట్టించుకోని గుమ్మడి గింజల్లో ఇప్పుడు పోషకాల ప్రాముఖ్యత అందరికీ తెలుస్తోంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి, గుండెను ఆరోగ్యంగా నిలుపుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిని నేరుగా పచ్చిగా తినవచ్చు. లేదా కాస్త వేయించి తీసుకోవచ్చు. పోషకాలు బాగా అందాలంటే మధ్యాహ్నం భోజనం చేశాక ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ప్రొటీన్, జింక్ శరీరానికి బాగా చేరుతాయి.
ఆలివ్ గింజలు (గ్రాడెన్ క్రెస్ సీడ్స్): ఆలివ్ గింజలు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి. ఆయుర్వేదంలో వీటిని బాగా వాడతారు. చిన్నగా కనిపించినా, శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఎ, ఇ, పొటాషియం వీటిలో అధికం. సరైన పద్ధతిలో వాడితే మెటబాలిజం మెరుగుపడుతుంది. వీటిని ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. జుట్టు పెరుగుదలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. నెయ్యి లేదా కొబ్బరి నూనె కలిపి జుట్టుకు రాస్తే వేగంగా జుట్టు పెరుగుతుంది. హార్మోన్స్ సమస్యలు ఉన్నవారు వీటిని నెయ్యితో కలిపి తీసుకుంటే మంచిది.
చియా గింజలు: ఈ మధ్యకాలంలో చాలామంది చియా గింజలను వాడుతున్నారు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అజీర్తి, మలబద్ధకంతో బాధపడేవారు వీటిని రోజూ తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ కూడా వీటిలో పుష్కలం. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఇవి తోడ్పడతాయి. ప్రయోజనాలు పూర్తిగా అందాలంటే చియా గింజలను కనీసం అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. వీటిని స్మూతీలలో లేక జ్యూస్‌లలో కలుపుకోవచ్చు. నిమ్మరసంలో కలుపుకుని తాగితే ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా శరీరానికి అందుతాయి.
సబ్జా గింజలు: వీటిని తులసి గింజలు అని కూడా పిలుస్తారు. జీర్ణ శక్తిని పెంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహకరిస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. గుండె జబ్బుల చికిత్సలోనూ ఇవి ఉపయోగపడతాయి. నీరసంగా ఉన్నప్పుడు సబ్జా గింజలు తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది. ప్రయోజనం పొందాలంటే కనీసం పది నుంచి పదిహేను నిముషాల పాటు నానబెట్టాలి. హెర్బల్ టీలలో వీటిని కలిపి తాగితే ఎక్కువ లాభాలుంటాయి. కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు వీటిని తీసుకోవడం మంచిది.
నువ్వులు: నువ్వులను వంటల్లో ఎక్కువగా వాడతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ అధికం. నువ్వుల నుంచి నూనె కూడా తయారు చేస్తారు, దీన్ని చాలామంది వాడతారు. బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా నువ్వుల నూనె వాడుతారు. పచ్చి నువ్వులు కాకుండా, వాటిని కాస్త వేయించి, ఆపై మిక్సీ పట్టాలి. ఈ పొడి రూపంలో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నువ్వుల పొడిలో కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే చాలా మంచిది. రోటి పచ్చళ్లలో నువ్వుల పొడి కలుపుకుంటే అధిక మొత్తంలో క్యాల్షియం శరీరానికి అందుతుంది.




