Fish: దూరం నుంచి చూస్తే ఈ చిత్రంలో దుస్తులు ఆరేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి వారు ఆరేస్తున్నవి దుస్తులు కావు. ఈ చిత్రం ముంబైలోని వెర్సోవా బీచ్ దగ్గర దర్శనమిచ్చింది. ఇక్కడ మత్స్యకారులు చేపలను పట్టుకుని ఎండలో ఆరబెడుతారు. ఈ ప్రక్రియ చేపల వ్యాపారంలో చాలా ముఖ్యమైనది. అయితే మత్స్యకారులు ఇలా ఎందుకు చేస్తారు.. చేపలను ఎండబెట్టడం అనే ప్రక్రియ ఏమిటి.. తదితర విషయాలు తెలుసుకుందాం.
మత్స్యకారులు అధిక సంఖ్యలో చేపలను పట్టుకుంటారు. తర్వాత వాటిని వెదురు బొంగులకు కట్టి వేలాడదీస్తారు. ఇలా ఎండలో ఈ చేపలు క్రమంగా ఎండిపోతాయి. సముద్రంలో చేపలు పట్టడంపై నిషేధం ఉన్న సమయంలో ఈ చేపలను ఉపయోగిస్తారు. విదేశాల్లో ఇలాంటి చేపలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముంబై మాత్రమే కాదు, దేశంలోని గోవా వంటి చేపల పెంపకం జరిగే రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది. వర్షాకాలం చేపల పెంపకానికి ప్రసిద్ధి. వాటి సంఖ్యను పెంచడానికి, జూన్, ఆగస్టు మధ్య వాటిని వేటాడేందుకు నిషేధం విధిస్తారు. అంతేకాదు ఆ సమయంలో చేపలు పడితే జరిమానా విధిస్తారు. జైలుకు కూడా పంపుతారు. వర్షాకాలంలో చేపల విక్రయ వ్యాపారంతో సంబంధం ఉన్న అందరిపైనా మత్స్యశాఖ ఓ కన్నేసి ఉంచుతుంది.
చేపలకు ఉప్పురాసి ఎండబెడుతారు. ఇలా ఎండిన చేపలను ఎక్కువ కాలం ఉపయోగించవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఎండలో ఎండబెట్టడం వల్ల చేపలలో ఉన్న నీరు ఇంకిపోయి పొడిగా తయారవుతుంది. కాబట్టి అవి చెడిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పాటు వాటిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం కూడా ఉండదు.
అయితే వాటిని ఆరబెట్టడానికి మొదట చేపల లోపలి భాగాన్ని శుభ్రం చేస్తారు. తర్వాత ఉప్పు రాస్తారు. ఫలితంగా చేపలోని ప్రతి భాగానికి ఉప్పు చేరుతుంది. తరువాత చేపలను వెదురు బొంగులకి వేలాడదీస్తారు.
చేపల వ్యాపారుల ప్రకారం.. సూర్యరశ్మి, గాలి కారణంగా చేపలు దాదాపు 3 వారాల్లో పూర్తిగా ఎండిపోతాయి. వీటిని నిల్వ చేసి వర్షాకాలంలో వినియోగిస్తారు. ఈ ఎండు చేపలను పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన సముద్రతీర ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. ఇక్కడి రెస్టారెంట్‌లో ఎండు చేపలతో తయారుచేసిన వివిధ రకాల వంటకాలు చేస్తారు. ఉదాహరణకు గోవాలో, ఎండు చేపలతో తయారుచేసిన అనేక వంటకాలు బీచ్‌లో కనిపిస్తాయి.