
ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ లేనిదే ముద్ద దిగదు. పార్టీ అయినా ఫంక్షన్ అయినా విభిన్న రకాల చికెన్ వంటకాలు ఉండాల్సిందే. అయితే కోడి మాంసంలో ఏ భాగాన్ని తిన్నా రాని తృప్తి.. ఒక్క లెగ్ పీస్ తింటే వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే హోటల్‌కు వెళ్లినా, ఇంట్లో వండుకున్నా లెగ్ ముక్కల కోసం పోటీ పడుతుంటారు. ఇంతకీ చికెన్ లెగ్ పీస్‌లో ఏముంది? ఇది ఎందుకు అంత రుచిగా ఉంటుంది? దీని పోషక విలువల వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ లెగ్ ముక్కలు కోడిలోని ఇతర భాగాల కంటే భిన్నంగా ఉంటాయి. ఇందులో డ్రమ్‌స్టిక్, తొడ మాంసం కలిసి ఉంటాయి. దీనిని డార్క్ మీట్ అని కూడా పిలుస్తారు. మిగిలిన తెల్లటి మాంసం తో పోలిస్తే లెగ్ పీస్ ముక్కలు చాలా మృదువుగా, జ్యూసీగా ఉంటాయి. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ వీటిని లొట్టలు వేసుకుంటూ తింటారు.
లెగ్ ముక్కలు అంత రుచిగా ఉండటానికి ప్రధాన కారణం అందులో ఉండే మైయోగ్లోబిన్ అనే ప్రోటీన్. ఈ ప్రోటీన్ కండరాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో సహాయపడుతుంది. లెగ్ పీస్ అనేది కోడి శరీరంలో నిరంతరం కదిలే భాగం కాబట్టి అక్కడ ఈ ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మాంసానికి మంచి రంగును, ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.
చికెన్ లెగ్ ముక్కలు కేవలం రుచికరమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులో ఐరన్, జింక్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కేలరీల విషయానికి వస్తే.. సుమారు 44 గ్రాముల బరువున్న ఒక లెగ్ పీస్‌లో 12.4 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇందులో కొవ్వు శాతం కొద్దిగా ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకే జిమ్‌కు వెళ్లేవారు, కఠినమైన వ్యాయామం చేసేవారు లెగ్ ముక్కలను తినడానికి మొగ్గు చూపుతారు.
చికెన్ బ్రెస్ట్ పీస్‌తో పోలిస్తే లెగ్ పీస్‌లో కేలరీలు, కొవ్వు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ అందులోని పోషకాలు, రుచి మాత్రం అమోఘం. అందుకే చికెన్ మార్కెట్‌లో లెగ్ పీస్‌లకు ఉన్న డిమాండ్ ఎప్పుడూ తగ్గదు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..