
తమిళనాడు, కర్ణటకలతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా దేవుడి గుళ్ళల్లో కనిపించే ప్రసాదం పొంగల్. అన్నంతో చేసే ఈ పొంగల్ మెత్తగా.. కారం కారంగా ఉంటుంది. అయితే దీనిని వేరుశనగ పచ్చడి, కొబ్బరి చట్నీ తో తింటే మరింత రుచిగా ఉంటుంది. తమిళనాడు వాళ్ళు ఈ పొంగల్ ని సాంబార్ తో కలిపి తింటారు. ఈ రోజు ఉగాది స్పెషల్ గా టెంపుల్ స్టైల్ లో ఇంట్లోనే పొంగల్ ను చేసుకోవడం ఎలా తెలుసుకుందాం..
బియ్యం – ఒక కప్పు
పెసరపప్పు – ఒక కప్పు
జీడిపప్పులు- 10
మిరియాలు – ఒక టేబుల్ స్పూన్
జీల కర్ర – అర టేబుల్ స్పూన్
అల్లం ముక్కలు – అర టేబుల్ స్పూన్
కరివేపాకు – కొంచెం
ఇంగువ – కొంచెం
పచ్చి మిర్చి -8
ఎండు మిర్చి -4
నెయ్యి- కావలసినంత
తయారీ విధానం : ముందుగా స్టవ్ మీద బాణలి పెట్టి పెసర పప్పు వేసి దోరగా వేయించాలి. తర్వాత పెసర పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో బియ్యం వేసి రెండిటి రెండు మూడు సార్లు కడగాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని పెసర పప్పు తీసుకున్న కప్పు కొలతగా తీసుకుని ఆ గిన్నెలో ఆరు కప్పుల నీరు పోయండి. మూత పెట్టి నీరు బాగా మరిగించాలి.
ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి.. రెండు స్పూన్ల వెన్న వేసుకుని కరిగించాలి. తర్వాత కడిగిన పెసర పప్పు, బియ్యం వేసి వేయించాలి. ఇప్పుడు మరిగిన నీరు పోసి.. రుచికి సరిపడా ఉప్పు వేసి.. నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెజర్ పోయేవరకూ ఉంచి.. కుక్కర్ మూత తీసి అన్నంలో ఎక్కువ నీరు ఉంటె చిన్న మంట మీద ఉడికించండి. ఒక పొంగు వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనపెట్టుకోవాలి.
ఇంతలో మరో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి… దానిలో నెయ్యి వేసి టేబుల్ స్పూన్స్ మిరియాలు, కొంచెం సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర వేసి బాగా వేయించండి. సన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, జీడి పప్పు, ఇంగువ వేసి వేయించాలి. ఇప్పుడు ఈ పోపుని ఉడికించిన అన్నంలో వేసుకుని కలుపుకోండి. అంతే ఎంతో రుచికరమైన కట్టే పొంగల్ రెడీ. దీనిని చెట్నీతో గానీ సాంబార్ తో గానీ తినండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..