గరిబోళ్ల పవర్‌ఫుల్ డ్రింక్.. చెరుకు రసం ఈ టైంలో తాగితే లెక్కలేనన్ని ప్రయోజనాలు..
వేసవి కాలంలో శరీరాన్ని ఉత్తేజపరిచి, తక్షణ శక్తిని అందించడానికి చెరుకు రసం ఒక అద్భుతమైన, తక్కువ ఖర్చుతో కూడిన పానీయం. పండ్ల రసాలతో పోలిస్తే ఇది సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది. చెరుకు రసంలో అధిక శాతం నీరు ఉండటం వల్ల వేసవిలో శరీరానికి అవసరమైన తేమను అందిస్తుంది.

వేసవి కాలంలో శరీరాన్ని ఉత్తేజపరిచి, తక్షణ శక్తిని అందించడంలో చెరుకు రసం ఎంతో ప్రయోజనకరమైన పానీయం. ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. చెరుకు రసంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఇతర పండ్ల రసాలతో పోలిస్తే దీని ధర తక్కువగా ఉండటంతో, సామాన్యులు సైతం సులువుగా కొనుగోలు చేసి తాగగలుగుతారు. పండ్లు రసం గ్లాసు 70-80 రూపాయలు అవుతుంటే, చెరుకు రసం 20 రూపాయలకే లభిస్తుంది. చెరుకు రసంలో అధిక భాగం నీరే ఉంటుంది.. ఇది వేసవిలో శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందిస్తుంది. ముఖ్యంగా, వేసవిలో శరీరానికి లవణాలు అధికంగా అవసరం. 100 గ్రాముల చెరుకు రసంలో 60 మి.గ్రా సోడియం ఉంటుంది. ఒక పావు లీటర్ (250 మి.లీ) చెరుకు రసం తాగడం వల్ల రోజుకు అవసరమైన సోడియంలో దాదాపు 50% లభిస్తుంది. ఇందులో ఉండే రెడీమేడ్ షుగర్స్ కేవలం 15-20 నిమిషాల్లోనే రక్తంలో కలిసి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇది తేలికగా జీర్ణమై, త్వరగా శరీరంలోకి శోషించబడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. 100 గ్రాముల చెరుకు రసం నుండి 39 కేలరీలు లభిస్తాయి. 200 మిల్లీలీటర్ల గ్లాసు తాగడం వల్ల ఒక కాఫీ కప్పు నుండి లభించే శక్తి (72-75 కేలరీలు)కి సమానమైన శక్తిని పొందుతాం.
కొంతమంది తీపి ఎక్కువగా ఉండడం వల్ల బరువు పెరుగుతామేమోనని చెరుకు రసం తాగడానికి సంకోచిస్తారు. కానీ ఈ అపోహను విడనాడాలి. డయాబెటిస్ ఉన్నవారు రసంగా కాకుండా చెరుకు ముక్కలను తినవచ్చు. రసం తాగాలనిపిస్తే, అప్పుడప్పుడు చిన్న కాఫీ కప్పు అంత పరిమాణంలో తీసుకోవచ్చు.. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. డయాబెటిస్ లేనివారు ఎవరైనా నిస్సంకోచంగా చెరుకు రసం తాగవచ్చు.
చెరుకు రసం ఎప్పుడు తాగాలి..
చెరుకు రసం తాగడానికి ఉత్తమ సమయం సాయంత్రం 5 నుండి 5:30 గంటల మధ్య.. మధ్యాహ్న భోజనం తర్వాత నీరు తాగడం పూర్తయిన తర్వాత, ఈ సమయంలో 200-300 మిల్లీలీటర్ల చెరుకు రసం తీసుకోవడం మంచిది. సుమారు 100 కేలరీలు మాత్రమే లభించినప్పటికీ, ఇది తక్షణమే రక్తంలో శక్తిని నింపుతుంది. సాల్ట్స్, విటమిన్లు, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా అంది.. శరీరంలోని ప్రతి కణానికి శక్తినిస్తుంది. వేసవిలో వచ్చే అలసటను తగ్గించడానికి ఇది చాలా సహాయపడుతుంది. సాయంత్రం చెరుకు రసం తాగిన గంట తర్వాత మంచి ఆకలి పుడుతుంది.. అప్పుడు రాత్రి 7 గంటల లోపు పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకోవడం మంచిది. పాఠశాల నుండి వచ్చిన పిల్లలకు కూడా తక్షణ శక్తి కోసం చెరుకు రసం ఇవ్వవచ్చు.
ముఖ్యమైన సూచనలు:
తాజాగా సేవించండి: చెరుకు రసం తీసిన పావుగంట, అరగంట లోపే రంగు, రుచి మారిపోతాయి కాబట్టి అప్పటికప్పుడు తీయించుకున్నది తాగాలి.
ఐస్ వద్దు: వేసవిలో చల్లగా తాగాలనిపించినా, చెరుకు రసంలో ఐస్ వేయకూడదు. ఐస్ వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, టాన్సిల్స్ సమస్యలు రావచ్చు. ఐస్ తయారు చేయడానికి వాడిన నీరు కలుషితమైతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
రుచి కోసం: రసంలో కొద్దిగా నిమ్మరసం, చాలా చిన్న అల్లం ముక్క వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది, తాజాగా అనిపిస్తుంది.
నెమ్మదిగా తాగండి: నీళ్లు తాగినట్లు గడగడా కాకుండా, 5-10 నిమిషాల పాటు నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. ఇలా తాగడం వల్ల లాలాజలం రసంతో కలిసి జీర్ణక్రియకు సహాయపడుతుంది, లాలాజలంలోని లైసోజోమ్ క్రిములను శుద్ధి చేస్తుంది.
డిన్నర్‌కు బదులు: కొన్నిసార్లు మధ్యాహ్నం భారీ భోజనం చేసి, సాయంత్రం ఆకలి లేకపోతే, 250-400 మిల్లీలీటర్ల చెరుకు రసాన్ని రాత్రి భోజనానికి బదులుగా తీసుకోవచ్చు.
సంవత్సరం పొడవునా తాగినప్పటికీ, వేసవిలో ప్రత్యేకంగా చెరుకు రసం తీసుకోవడం వల్ల బలహీనత రాకుండా, లవణాలు మంచిగా అంది ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
