సంపూర్ణ ఆరోగ్యానికి సిరిధాన్యాల వరం.. లాభాలు తెలిస్తే..
02 May 2026
Jyothi Gadda
నేటి యాంత్రిక జీవనంలో ఆహారపు అలవాట్లు మారిపోయి రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మన పూర్వీకులు భుజించిన సిరిధాన్యాల ప్రాముఖ్యతను నిపుణులు మళ్ళీ గుర్తు చేస్తున్నారు.
ముఖ్యంగా సామలు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. సిరిధాన్యాలలో ఒకటైన సామలు ఆరోగ్యానికి కల్పవల్లి లాంటివి. పీచు పదార్థం, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండి గ్లూటెన్ రహితం.
సామలలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు, కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక ఉత్తమ ఆహారం.
అలాగే, ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగి, ఆకలి త్వరగా వేయదు. ఇది సహజంగానే బరువు తగ్గాలనుకునే వారికి సహాయపడుతుంది.
సామలలో ఉండే మెగ్నీషియం, విటమిన్ B3 గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇందులోని అధిక ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నేటి తరం మహిళల్లో అధికంగా కనిపిస్తున్న పిసిఒడి (PCOD) సమస్యలను అదుపు చేయడంలో సామలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను తగ్గించి, స్పెర్మ్ కౌంట్ పెంచడానికి ఇవి తోడ్పడతాయి.
శరీరంలోని శోషరస వ్యవస్థను (Lymphatic system) శుద్ధి చేయడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గ్లూటెన్ లేకపోవడం వల్ల జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి ఇది సురక్షితమైన ఎంపిక.
సామలలో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి, కణజాలాల మరమ్మత్తుకు సహాయపడతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడు, గొంతు, థైరాయిడ్ వంటి క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
సామలను బియ్యానికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. వీటితో ఉప్మా, దోసెలు, పులావ్ లేదా కిచిడీ వంటి రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. వారంలో కనీసం మూడు నాలుగు సార్లు తిన్నా కూడా చాలా మంచిది.