AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్ ఆస్తులకు వారసులెవరు? మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ ఎవరికి చెందాలి

మనం ఇల్లు, కారు లేదా బ్యాంకు డిపాజిట్ల వంటి భౌతిక ఆస్తులకు వారసులను నియమించుకుంటాం. కానీ ప్రస్తుతం మన జీవితాలు ఆన్‌లైన్‌తో ముడిపడి ఉన్న నేపథ్యంలో, మన మరణం తర్వాత డిజిటల్ ఆస్తుల పరిస్థితి ఏమిటనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ‘డిజిటల్ లీగల్ హైర్’ (డిజిటల్ వారసుడు) అనే సరికొత్త ఫ్రేమ్‌వర్క్‌పై కసరత్తు చేస్తోంది.

ఆన్‌లైన్ ఆస్తులకు వారసులెవరు? మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ ఎవరికి చెందాలి
Digital Heir1.jpg
Nikhil
|

Updated on: May 02, 2026 | 10:42 PM

Share

ఒక వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే వారి సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, క్రిప్టోకరెన్సీ వాలెట్లలో ఉన్న విలువైన డేటా లేదా సంపదను కుటుంబ సభ్యులు తిరిగి పొందడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘డిజిటల్ విల్’ అనే భావన ప్రాధాన్యత సంతరించుకుంది. భౌతిక ఆస్తుల మాదిరిగానే డిజిటల్ ఆస్తులను కూడా చట్టబద్ధంగా బదిలీ చేయడానికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తోంది.

డిజిటల్ విల్ అంటే..

మనం రాసే సాధారణ వీలునామా లాగే ‘డిజిటల్ విల్’ కూడా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ లేదా వ్యవస్థ. ఇందులో ఒక వ్యక్తి తన మరణం తర్వాత తన ఆన్‌లైన్ ఖాతాలు, ఈమెయిల్స్, క్లౌడ్ స్టోరేజ్, క్రిప్టోకరెన్సీ వాలెట్లను ఎవరు చూసుకోవాలి.. వాటిని ఎలా నిర్వహించాలనే విషయాలను స్పష్టంగా పేర్కొనవచ్చు. సాధారణ వీలునామాతో పోలిస్తే డిజిటల్ విల్ అనేది పాస్‌వర్డ్‌లు, యాక్సెస్ హక్కులు, ప్రైవసీ వంటి సాంకేతిక అంశాలతో ముడిపడి ఉంటుంది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, క్లౌడ్ స్టోరేజ్‌లోని డేటా, క్రిప్టోకరెన్సీలు ఆర్థిక విలువను కలిగి ఉండి డిజిటల్ ఆస్తులుగా మారుతున్నాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు లాక్ చేయబడిన ఫోన్లు, కఠినమైన ప్రైవసీ నిబంధనల వల్ల కుటుంబ సభ్యులు ఆ ఖాతాలను యాక్సెస్ చేయలేక తీవ్రంగా నష్టపోతున్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాలు

ఇప్పటివరకు మన దేశంలో డిజిటల్ వారసత్వానికి సంబంధించి స్పష్టమైన చట్టాలు లేవు. దీనివల్ల సాంకేతిక కంపెనీలు యూజర్ల ప్రైవసీని సాకుగా చూపిస్తూ కుటుంబ సభ్యులకు కూడా ఖాతాల యాక్సెస్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికే కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలపై పనిచేస్తోంది. ఇకపై వినియోగదారులు తమ ఖాతాలకు డిజిటల్ వారసుడిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే డిజిలాకర్ వంటి వ్యవస్థల ద్వారా ఖాతాల యాక్సెస్‌ను సురక్షితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో క్రిప్టోకరెన్సీల బదిలీ ఒక అతిపెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే బిట్‌కాయిన్ వంటి క్రిప్టో ఆస్తుల తాలూకు ప్రైవేట్ కీస్‌ను కోల్పోతే ఆ సంపదను ఎవరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే రికవరీ వివరాలను సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రైవసీ – మెమోరియలైజ్డ్ ఖాతాలు

ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి ఖాతాలు దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఫేస్‌బుక్ వంటి సంస్థలు ‘మెమోరియలైజ్డ్ అకౌంట్’ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. డిజిటల్ విల్ ద్వారా మన మరణం తర్వాత ఖాతాను డిలీట్ చేయాలా లేదా అలాగే ఉంచాలా అనేది ముందే నిర్ణయించవచ్చు. భారతదేశపు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP) వినియోగదారుల డేటా రక్షణకు ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే భవిష్యత్తులో రాబోయే నిబంధనలలో ప్రైవసీకి భంగం కలగకుండా కేవలం ఆర్థిక సంబంధిత ఆన్‌లైన్ డేటాకు మాత్రమే వారసులు యాక్సెస్ పొందేలా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

Follow Us