
చలికాలం, వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చేది చల్లని చెరకు రసం. రోడ్డు పక్కన దొరికే ఈ సహజ పానీయం తాగగానే శరీరం చల్లబడటమే కాకుండా శక్తి కూడా వస్తుంది. అయితే చెరకు రసం అందరికీ ఆరోగ్యకరం కాదని, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చెరకు రసంలో కేవలం తీపి మాత్రమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే సహజ కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. అందుకే నీరసంగా ఉన్నప్పుడు ఇది బెస్ట్ ఎనర్జీ డ్రింక్. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి, గుండె పనితీరుకు తోడ్పడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్ కణాల నష్టాన్ని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం కాంతివంతంగా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ చెరకు రసంలో సహజ చక్కెర, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.
మెదాంత హాస్పిటల్ నిపుణులు డాక్టర్ సౌరవ్ శిశిర్ అగర్వాల్ ప్రకారం ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసాన్ని నివారించాలి..
మధుమేహ వ్యాధిగ్రస్తులు: రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉన్నందున షుగర్ ఉన్నవారు లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.
ఊబకాయం: అధిక క్యాలరీల వల్ల బరువు పెరగాలనుకునే వారికి ఇది ఇబ్బందిగా మారవచ్చు.
లివర్ సమస్యలు: ఫ్యాటీ లివర్ లేదా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న రోగులు దీనిని తీసుకోకపోవడం ఉత్తమం.
దంత సమస్యలు: చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల దంతక్షయం వచ్చే అవకాశం ఉంటుంది.