Biryani: ప్రపంచమంతా మెచ్చిన 7 రకాల భారతీయ బిర్యానీలు.. ఈ వీకెండ్‌లో తప్పక ట్రై చేయాల్సిందే
బిర్యానీ అనేది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం, దీని విభిన్న రుచులు, ప్రాంతీయ శైలి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. ఈ వీకెండ్ లో మీ కుటుంబం లేదా స్నేహితులతో రుచికరమైన బిర్యానీని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, భారతదేశంలోని ఈ 7 ఫేమస్ బిర్యానీ రెసిపీల గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వాటి స్పెషాలిటీ ఏంటో చూద్దాం..

బిర్యానీ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు హైదరాబాద్. హైదరాబాద్ పేరు చెప్పినా వెంటనే బిర్యానీ గుర్తొస్తుంది. అంతలా దీని రుచి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ గా మారింది. అయితే, దీని డామినేషన్ కారణంగా భారత్ లో ఉన్న ఇతర బిర్యానీ ఫ్లేవర్లకు ఆదరణ తగ్గిందనే చెప్పాలి. కానీ, దేని ప్రత్యేకత దానిదే. ఈ సారి హైదరాబాద్ బిర్యానీతో పాటు ఈ స్పెషల్ బిర్యానీలను కూడా ట్రై చేయండి. ఇండియా వ్యాప్తంగా వీటికి మంచి క్రేజ్ ఉంది. వీటిని తయారు చేసే పద్ధతి కూడా ఆకట్టుకుంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన పద్ధతిలో బిర్యానీని తయారు చేస్తారు. అందులో మోస్ట్ ఫేమస్ అయిన 7 రకాల బిర్యానీలివి.
హైదరాబాదీ బిర్యానీ
హైదరాబాద్‌కు చెందిన ఈ బిర్యానీ తన “దమ్” వంట పద్ధతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బాస్మతి బియ్యం, మాంసం (చికెన్ లేదా మటన్), కుంకుమపువ్వు, ఏలకులు, లవంగాలతో తయారైన ఈ బిర్యానీ సుగంధభరితమైన రుచిని అందిస్తుంది. రైతాతో సర్వ్ చేస్తే రుచి రెట్టింపు అవుతుంది.
లక్నో బిర్యానీ (అవధీ బిర్యానీ)
లక్నో నుండి వచ్చిన ఈ బిర్యానీ సున్నితమైన రుచులకు ప్రసిద్ధి. జాజికాయ, జాపత్రి, కేవ్రా నీళ్లతో తయారవుతుంది. మాంసం బియ్యం విడిగా ఉడికించి, లేయర్లుగా అమర్చి వండడం వల్ల ఈ బిర్యానీకి ప్రత్యేకమైన రుచి వస్తుంది.
కోల్‌కతా బిర్యానీ
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ బిర్యానీలో బంగాళాదుంపలు, గుడ్డు మాంసం కలిసి ఉంటాయి. రోజ్ వాటర్ కుంకుమపువ్వు వాడటం వల్ల ఈ బిర్యానీ తేలికైన సుగంధాన్ని కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా గుడ్డుతో సర్వ్ చేస్తారు.
అంబూర్ బిర్యానీ
తమిళనాడులోని అంబూర్‌కు చెందిన ఈ బిర్యానీ సీరా సాంబా బియ్యంతో తయారవుతుంది. ఎండు మిరపకాయల వాడకం వల్ల ఇది కారంగా ఉంటుంది. చికెన్ లేదా మటన్‌తో తయారైన ఈ బిర్యానీని వంకాయ కూరతో సర్వ్ చేస్తారు.
మలబార్ బిర్యానీ
కేరళకు చెందిన ఈ బిర్యానీలో చిన్న గింజల బియ్యం, కొబ్బరి, జీడిపప్పు, ఎండుద్రాక్షలు వాడతారు. చేపలు, రొయ్యలు లేదా చికెన్‌తో తయారవుతుంది. ఈ బిర్యానీ సున్నితమైన మసాలాలతో తయారై, తీరప్రాంత రుచిని అందిస్తుంది.
సింధీ బిర్యానీ
సింధీ శైలి బిర్యానీ కారంగా, టాంగీ రుచితో ఉంటుంది. ఎండు ఆలుబుఖారాలు, బంగాళాదుంపలు, మసాలాల మిశ్రమంతో తయారవుతుంది. చికెన్ లేదా మటన్‌తో ఈ బిర్యానీ రుచి ప్రియులకు అద్భుతమైన ఎంపిక.
ముగలాయ్ బిర్యానీ
మొఘలుల యుగం నుండి వచ్చిన ఈ బిర్యానీ రాయల్ రుచిని అందిస్తుంది. పెరుగు, నట్స్, ఎండుద్రాక్షలు, ఘాటైన మసాలాలతో తయారవుతుంది. వేయించిన ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే దీని రుచి అమోఘంగా ఉంటుంది.




