AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టేస్ట్‌కి టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు తయారీ రహాస్యం ఇదే.. ఎంత సింపులంటే..

స్పెషల్ రాగి లడ్డు రెసిపీ.. శరీరానికి పుష్టినిచ్చే రాగి లడ్డు తయారీ చాలా సులభం.. ఈ లడ్డు రెసిపీ చాలా సులభం, పోషకమైనది. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం అత్యవసరం. సరైన చిట్కాలతో రుచికరమైన లడ్డులను ఇంట్లోనే సిద్ధం చేసుకోవచ్చు.. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా చాలా ఇష్టమైనది.. ఆరోగ్యకరమైనది.. దీని ద్వారా.. బయటఫుడ్ ను నియంత్రించుకోవచ్చు..

టేస్ట్‌కి టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు తయారీ రహాస్యం ఇదే.. ఎంత సింపులంటే..
Ragi Laddu Recipe
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2026 | 1:17 PM

Share

ఉరుకులు పరుగుల జీవితం.. చాలా మంది బయట ఏది దొరికితే.. ఆ ఫుడ్ తీసుకుంటారు.. చివరకు స్నాక్స్ కూడా బయటవే తెచ్చుకుని తింటారు. అయితే.. కొన్ని ఆహార పదార్థాలను ఇంట్లో తయారు చేసుకుని.. తింటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. బలానికి బలం చేకూరుతాయి.. అలాంటి స్నాక్స్ లో రాగి లడ్డు ఒకటి.. శరీరానికి పుష్టినిచ్చే ఆహారపదార్థాల్లో రాగి లడ్డు ముందు వరుసలో ఉంటుంది.. రాగి లడ్డు కాల్షియం, ఐరన్, ఫైబర్‌తో కూడిన అత్యంత ఆరోగ్యకరమైన సాంప్రదాయ తీపి పదార్థం. రాగి పిండి, బెల్లం, నెయ్యి, యాలకుల పొడితో వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎముకల బలం, రక్తహీనత తగ్గింపు, బరువు తగ్గడంలో సహాయపడే అద్భుతమైన చిరుతిండి ఇదే..

రాగి లడ్డు చాలా రుచికరమైనది.. పోషకమైనది. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి, కండరాల సంకోచాలకు, రక్తం గడ్డకట్టడానికి చాలా అవసరం. రాగి లడ్డు మిల్లెట్లను ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినొచ్చు.. సరైన చిట్కాలను పాటిస్తే ఇంట్లో సులభంగా రాగి లడ్డులను తయారు చేసుకుని తినవచ్చు.

రాగి లడ్డు పర్ఫెక్ట్ రెసిపీ..

తయారీ విధానం:

ముందుగా, రెండు కప్పుల రాగిపిండిని ఒక వెడల్పాటి కడాయిలో తీసుకోండి. ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, సన్నని సెగ మీద నిరంతరం కలుపుతూ వేపుకోవాలి. రాగిపిండి మంచి సువాసన వచ్చేంత వరకు వేపడం ముఖ్యం. ఇది మిగిలిన పిండిల మాదిరిగా రంగు మారదు, కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలి. అడుగు అంటకుండా, మాడిపోకుండా చూసుకోవాలి. రాగిపిండి కాస్త వేగుతున్నప్పుడే పావు కప్పు ఎండుకొబ్బరి తురుమును కూడా వేసి వేపాలి. ఇది లడ్డుకు మంచి టెక్స్చర్ అందిస్తుంది. ఇష్టం లేని వారు ఎండుకొబ్బరిని స్కిప్ చేయవచ్చు. రాగిపిండి వేగి, మంచి సువాసన వచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.

అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించి, అందులో రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు పలుకులు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా అయ్యేంత వరకు వేపాలి. వేగిన పప్పులను నేతితో సహా వేపిన రాగిపిండిలో వేసి, చెంచాతో వేడి మీదే బాగా కలపాలి. ఆ తర్వాత, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, రెండు చిటికెల జాజికాయ పొడి వేసి కలపండి. జాజికాయ పొడి అద్భుతమైన రుచినిస్తుంది.

ఇప్పుడు, అదే కడాయిలో రెండు కప్పుల రాగిపిండికి సరిపడా ఒకటిన్నర కప్పు బెల్లం తురుమును తీసుకోండి. బెల్లం నాణ్యతను బట్టి 1/4 కప్పు నుంచి 1/3 కప్పు వరకు నీరు చేర్చవచ్చు. బెల్లాన్ని కరిగించడం మాత్రమే ముఖ్యం, పాకం పట్టనవసరం లేదు. ఇలా కరిగించడం వల్ల బెల్లంలోని మలినాలను తొలగించవచ్చు.. అలాగే బెల్లం రుచి రాగిపిండికి పూర్తిగా పట్టుకుంటుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, పాకాన్ని జల్లెడ పట్టి, రాగిపిండి మిశ్రమంలో వేడి మీదే పోయండి.

రాగి లడ్డులను సాధారణ లడ్డుల మాదిరిగా కాకుండా వేడి మీదే కట్టాలి. చల్లారిన తర్వాత కట్టడానికి రాదు. లడ్డు కట్టడానికి, చేతిని చల్లటి నీళ్లలో ముంచి, చేతికి నెయ్యి రాసుకొని, మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డులను చుట్టాలి. ఇది చేతిని వేడి నుంచి కాపాడుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా లడ్డు సరిగా కట్టకపోతే, కంగారు పడకుండా రెండు చెంచాల వేడినీటిని మిశ్రమంలో కలిపి మళ్లీ ప్రయత్నించండి. ఎక్కువ నీరు పోయకుండా, కేవలం బైండ్ అయ్యేంత వరకు మాత్రమే నీటిని వాడాలి. చేతికి నెయ్యి రాసుకొని లడ్డులు కట్టడం వల్ల అవి చూడటానికి, తినడానికి కూడా బాగుంటాయి.

ఈ రాగి లడ్డులు ఎయిర్ టైట్ డబ్బాలో కనీసం వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఎల్లప్పుడూ ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి లడ్డులను తప్పక ప్రయత్నించి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు.. బయటఫుడ్ ను నివారించుకోవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us