AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potlakaya Fry:  పెళ్లి విందులో చేసే పొట్లకాయ వేపుడు.. ఇంట్లోనే ఇలా చేస్తే నచ్చనివారు కూడా లొట్టలేస్తూ తింటారు!

పెళ్లి భోజనంలో వడ్డించే వంటకాల రుచే ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా అరటి ఆకులో వేడి వేడి అన్నం, పప్పు, సాంబార్‌తో పాటు వడ్డించే కూరలు ఎంతో రుచిగా అనిపిస్తాయి. అలాంటి వంటకాల్లో పెళ్లి స్టైల్‌లో తయారుచేసే పొట్లకాయ వేపుడు కూడా ఒకటి. సాధారణంగా పొట్లకాయ కూర అంటే కొందరు పెద్దగా ఇష్టపడరు. కానీ కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమంతో చేసే ఈ వేపుడు మాత్రం రుచిగా ఉంటుంది.

Potlakaya Fry:  పెళ్లి విందులో చేసే పొట్లకాయ వేపుడు.. ఇంట్లోనే ఇలా చేస్తే నచ్చనివారు కూడా లొట్టలేస్తూ తింటారు!
Potlakaya Fry Recipe Wedding Style
Bhavani
|

Updated on: Nov 11, 2026 | 7:19 PM

Share
ఈ కూర తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా దొరికే పొట్లకాయ, శెనగపప్పు, కొబ్బరి, పచ్చిమిర్చితో పెళ్లి విందు రుచిని తీసుకురావచ్చు. అన్నం, పప్పు, సాంబార్‌తో పాటు సైడ్ డిష్‌గా వడ్డించడానికి ఇది చక్కగా సరిపోతుంది. మరి ఈ పెళ్లి స్టైల్ పొట్లకాయ వేపుడును ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

పొట్లకాయ ఉడికించడానికి:

  • శెనగపప్పు – అర కప్పు

  • పొట్లకాయ – 300 గ్రాములు

  • పసుపు – పావు టీస్పూన్

  • నీళ్లు – అర కప్పు

తాలింపు కోసం:

  • నూనె – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు

  • ఆవాలు – అర టీస్పూన్

  • మినపప్పు – అర టీస్పూన్

  • ఎండుమిర్చి – 2 నుంచి 3

  • ఉల్లిపాయ – 1

  • కరివేపాకు – 1 రెమ్మ

  • ఉప్పు – రుచికి సరిపడా

కొబ్బరి మిశ్రమం కోసం:

  • తురిమిన కొబ్బరి – ఒక కప్పు

  • పచ్చిమిర్చి – 2

  • జీలకర్ర – 1 టీస్పూన్

ముందుగా శెనగపప్పును నానబెట్టుకోవాలి

ముందుగా శెనగపప్పును శుభ్రంగా కడిగి నీటిలో సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పొట్లకాయ పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పొట్లకాయ ముక్కలు ఒకే పరిమాణంలో ఉంటే ఉడికేటప్పుడు సమానంగా ఉడుకుతాయి.

పొట్లకాయ, శెనగపప్పును ఉడికించాలి

ఇప్పుడు కుక్కర్‌లో తరిగిన పొట్లకాయ ముక్కలు, నానబెట్టిన శెనగపప్పు వేయాలి. అందులో పసుపు, అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత కుక్కర్ తెరిచి పక్కన పెట్టుకోవాలి.

కొబ్బరి, పచ్చిమిర్చితో ప్రత్యేక మిశ్రమం

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో తురిమిన కొబ్బరి, రెండు పచ్చిమిర్చి, ఒక టీస్పూన్ జీలకర్ర వేయాలి. నీళ్లు పోయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమమే పొట్లకాయ వేపుడికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.

తాలింపు వేసి పొట్లకాయ వేపుడు తయారు చేయాలి

స్టవ్‌పై బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు మెత్తగా వేగిన తర్వాత తగినంత ఉప్పు కలపాలి.

ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ, శెనగపప్పు మిశ్రమాన్ని అందులోని నీటితో సహా బాణలిలో పోయాలి. బాగా కలిపి నీరు కొంతవరకు ఇంకిపోయే వరకు ఉడికించాలి. అనంతరం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి మరో రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి. అంతే.. పెళ్లి విందులో వడ్డించే రుచికరమైన పొట్లకాయ వేపుడు సిద్ధమవుతుంది.

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే రుచి అదుర్స్!

పొట్లకాయను మరీ మెత్తగా కాకుండా తగినంత మాత్రమే ఉడికించాలి. శెనగపప్పును ముందుగా అరగంట నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది. కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్రను నీళ్లు పోయకుండా గ్రైండ్ చేయడం వల్ల వేపుడికి మంచి రుచి, ఆకృతి వస్తాయి. చివర్లో కొబ్బరి మిశ్రమం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు. రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది.

అన్నం, పప్పుతో కలిపి తింటే అద్భుతం!

ఈ పెళ్లి స్టైల్ పొట్లకాయ వేపుడును వేడివేడి అన్నం, పప్పు, సాంబార్‌తో కలిపి తినవచ్చు. శెనగపప్పు వల్ల కాస్త దట్టమైన రుచి, కొబ్బరి వల్ల మంచి సువాసన వస్తాయి. సాధారణంగా పొట్లకాయ కూర తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ పద్ధతిలో తయారుచేస్తే ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది.

Follow Us