
షుగర్ ఉన్నవారు ఏదైనా పండు తినాలంటే ముందుగా వంద సార్లు ఆలోచిస్తారు. ముఖ్యంగా నారింజ పండు తీపిగా ఉండటంతో అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు నారింజ పండ్లను అసలు తినకూడదా? లేక తినడానికి ఏవైనా ప్రత్యేక పద్ధతులు ఉన్నాయా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
నారింజ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 40-43 మధ్యలో ఉంటుంది. ఇది చాలా తక్కువ. దీని అర్థం.. మీరు నారింజ తిన్నప్పుడు అందులోని గ్లూకోజ్ మీ రక్తంలోకి వెంటనే విడుదల కాదు. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా జరిగి, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని మితంగా తీసుకోవడం సురక్షితమే.
డయాబెటిస్ ఉన్నవారు నారింజ రసం తాగడం కంటే పండును నేరుగా తినడమే మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే* జ్యూస్ తీసే క్రమంలో శరీరానికి అవసరమైన ఫైబర్ పూర్తిగా తొలగిపోతుంది. ఫైబర్ లేని జ్యూస్ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.
నారింజ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొందరు మాత్రం వైద్యుల సలహా లేకుండా వీటిని తీసుకోకూడదు.
ఇన్సులిన్ వాడేవారు: క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకునే వ్యక్తులు నారింజ తినే ముందు డాక్టర్‌ను సంప్రదించాలి.
కిడ్నీ సమస్యలు: మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారికి నారింజలోని పొటాషియం ప్రతికూలంగా మారవచ్చు. వారికి ఇది దాదాపు విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యాసిడ్ రిఫ్లక్స్: కడుపులో మంట లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారికి నారింజ తింటే ఆ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.
నారింజ కేవలం షుగర్ నియంత్రణకే కాదు.. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్-సి, ఫోలేట్, పొటాషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
మధుమేహం ఉన్నవారు నారింజను మితంగా, పండు రూపంలో తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, మీ శరీర తత్వాన్ని బట్టి ఏదైనా మార్పు చేసే ముందు వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.