
గోంగూరతో చేసే ఏ వంటలైనా చాలా రుచిగా ఉంటాయి. పుల్ల పుల్లగా.. కారం కారంగా భలేగా ఉంటాయి. గోంగూర పచ్చడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గోంగూరతో ఎన్నో రకాల నాన్ వెజ్ వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. గోంగూర మటన్, చికెన్, రొయ్యలు ఇలా చాలానే చేస్తారు. గోంగూరతో కలిపి ఇప్పుడు వెజ్ వంటలు కూడా తయారు చేస్తున్నారు. అలాగే గోంగూర కోడి గుడ్డు కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అలా ఈ కర్రీ వేసుకుని తింటే.. వాటే టేస్ట్ అనాల్సిందే. అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఈ కర్రీ తిన్నారంటే.. మళ్లీ ఇలాగే చేసుకుని తింటారు. డిఫెరెంట్‌గా భలేగా ఉంటుంది. మరింకెందుకు లేట్ ఈ గోంగూర గుడ్డు కర్రీని ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పుల్లని గోంగూర, గుడ్లు, ఆయిల్, ఉల్లి పాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి, యాలకులు.
ముందుగా కోడి గుడ్లను ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూర కూడా శుభ్రంగా కడిగి.. వేయించి పక్కన పెట్టాలి. గోంగూర చల్లారాక మిక్సీలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కర్రీ పాన్ పెట్టుకోవాలి. అందులో మసాలా దినుసులు లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి, యాలకులు వేసి వేయించుకోవాలి. వీటిని చల్లారాక పౌడర్‌లా చేసుకుని పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదే పాన్‌లో ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లి పాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి.
ఉల్లి పాయ ముక్కలు కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. ఇది వేగాక ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వీటిని కూడా ఓ రెండు నిమిషాలు వేయించాక.. పొట్టు తీసి పెట్టుకున్న కోడి గుడ్లను కూడా వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి ఓ రెండు నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ నెక్ట్స్ గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా కలిపి.. ఓ రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర కోడి గుడ్డు కర్రీ సిద్ధం.