చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియులకు చాలా ఇష్టం. చికెన్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. చికెన్‌తో ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు. స్నాక్స్, కర్రీలు, స్టాటర్స్, వేపుళ్లు అన్నీ ఎంతో రుచిగా ఉంటాయి. ఒక్కోటి ఒక్కో స్టైల్‌లో చేస్తూ ఉంటారు. ఇలా చికెన్‌తో చేసే వాటిల్లో చింతామణి చికెన్ కూడా ఒకటి. దీన్ని స్టాటర్, ఫ్రై, కర్రీ కూడా చేస్తారు. ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా చేసే చికెన్ రెసిపీల్లోనే కొద్దిగా మార్పులు చేస్తే చాలు. ఈ కర్రీ కూడా చాలా త్వరగా అయిపోతుంది. మరి ఈ చింతామణి చికెన్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి. ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మిరియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, సోంపు, ఇంగువ, కొత్తిమీర, నెయ్యి, ఆయిల్.
ముందుగా ఒక కర్రీ పాన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ ఒకదాని తర్వాత మరొకటి వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చి మిర్చి వేసి రంగు మారేంత వరకు వేయించి.. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కలపాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ కూడా వేసి కలుపుకోవాలి.
చికెన్‌ని ఓ పది నిమిషాల పాటు వేయించాక.. ఉప్పు, కారం, పసుపు వేసి ఓ రెండు నిమిషాలు ఫ్రై చేయాలి. ఆ తర్వాత సోంపు పొడి, మిరియాల పొడి, గరం మసాలా కూడా వేసి ఓ నిమిషం వేయించాక.. నీళ్లు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఫ్రైగా కావాలి అనుకునేవారు.. నీళ్లు వేయకుండా చికెన్‌ని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. అంతే చింతామణి చికెన్ సిద్ధం.