కాలం ఏదైనా సరే సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఏదో ఒక స్నాక్ పొట్టలో పడాల్సిందే. బజ్జీలు, పునుగులు, వడలు, మరమరాల మిక్చర్,వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ ఇలా సమయాన్ని బట్టిఏదో ఒకటి తినాలి. అయితే ఎప్పుడూ రొటీన్‌గా చేసేవి కాకుండా కాస్త వెరైటీగా ఒకసారి ఇంట్లోనే క్యాబేజీ వడలు తయారు చేయండి. క్యాబేజీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నేరుగా క్యాబేజీ తినడం ఇష్టం లేని ఇలా వడలను వేసుకుని తినవచ్చు. ఇవి చాలా రుచిగా ఉండటమే కాకుండా.. త్వరగా అయిపోతుంది. మరి ఈ క్యాబేజీ వడలను ఎలా తయారు చేస్తారు? ఈ వడలను తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్యాబేజీ తరుగు, మినపప్పు, శనగపప్పు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు, ఆయిల్.
ముందుగా క్యాబేజీ వడలను వండటానికి పప్పులను నానబెట్టుకోవాలి. మినపప్పు, శనగపప్పులో గోరు వెచ్చటి నీళ్లు వేసి ఓ రెండు లేదా మూడు గంటలు అయినా ముందు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని వడకట్టి మీక్సీలో వేసి రుబ్బాలి. ఇందులోనే అల్లం, పచ్చి మిర్చి, ఉప్పు, ఇంగువ, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని, క్యాబేజీ, జీలకర్ర వేసి కూడా వేసి అన్నీ మిక్స్ చేయాలి.
ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. వేడి చేయాలి. ఆ తర్వాత వడలను వేసి.. రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత వీటిని టిష్యూ పేపర్ మీద వేయాలి. దీని వల్ల ఎక్స్‌ట్రా ఉన్న ఆయిల్ పీల్చుకుంటుంది. అంతే ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ వడలు రెడీ. వీటిని నేరుగా వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. లేదంటే టమాటా సాస్‌తో అయినా తినవచ్చు.