
ఆదివారం రాగానే.. ఎవరి ఇంట్లో అయినా నాన్ వెంజ్ వంటలతో ఘుమఘుమలాడుతూ ఉంటుంది. ఇళ్లంతా సువాసనలు వెదజల్లుతాయి. అందులోనూ ఎక్కువ మంది ఇష్టపడి తినేది ‘చికెన్’. నాన్ వెజ్ లో చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. ఇప్పటికే చికెన్ తో మనం ఎన్నో రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో నోరూరించే చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. మరి ఆ చికెన్ రెసిపీ ఏంటి? అనుకుంటున్నారా.. రెస్టారెంట్, హోటల్స్ లో చూసే ఉంటారు. అదే ‘ఆంధ్రా స్టైల్ కోడి వేపుడు’. వేడి వేడి అన్నంలోకి తింటే భలే రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మరసం, నూనె, ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి.
ముందుగా చికెన్ ఫ్రై చేసుకోవడానికి మ్యారినేట్ చేసుకోవాలి. ఇందుకు ఒక పాత్ర తీసుకుని అందులో చికెన్, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని.. మినిమమ్ ఓ గంట పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే చికెన్ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైకి సపరేట్ గా మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో.. ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు మిర్చి.. ఒక్కొక్కటి వేసి బాగా వేయించాలి. ఇవి చల్లారాక పొడి సిద్ధం చేసుకోవాలి.
ఇప్పుడు మందపాటి కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాకా.. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక.. కరివేపాకు ఆకులు వేసి కలపాలి. ఆ తర్వాత మ్యారినేట్ చికెన్ కూడా వేసి ఒకసారి కలిపాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా వేసాక.. ఓ ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న మసాలా పొడి ఓ రెండు మూడు సార్లు వేసుకుంటూ చికెన్ ని కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వత సిమ్ లో చికెన్ ని ఓ పది నిమిషాల పాటు వేయించుకోవాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే.. ఆంధ్రా స్టైల్ కోడి వేపుడు సిద్ధం.