మాంసాహార ప్రియులు ఇష్టంగా తినే వాటిల్లో బోటి కూడా ఒకటి. బోటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బోటితో కూర, వేపుడు వంటి వాటిని తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. సరిగ్గా వండితే బోటి కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయడం కూడా పెద్ద కష్టం కాదు. అయితే బోటి క్లీన్ చేయడం మాత్రం పనితో కూడుకున్నది. అది సరిగ్గా క్లీన్ చేస్తేనే కర్రీ కూడా రుచిగా వస్తుంది. నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. చాలా మంది ఎన్నో రకాలుగా కర్రీని చేస్తారు. అయితే ఒక్కసారి ఇలా చేస్తే మాత్రం అస్సలు వదిలి పెట్టరు. ఎవరు తిన్నా.. మళ్లీ మళ్లీ తయారు చేస్తారు. మరి ఈ బోటి కర్రీని ఎలా తయారు చేస్తారు? ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బోటి, పచ్చి మిర్చి, ఉల్లి పాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, ఎండు కొబ్బరి పొడి, యాలకులు, లవంగాలు, దాల్చన చెక్క, బిర్యానీ ఆకులు, ధనియాల పొడి, కొత్తి మీర, కరివేపాకు, ఆయిల్.
ముందుగా బోటీని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు బిర్యానీ ఆకు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పేస్ట్, పసుపు వేసి వేయించాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు బోటి వేసి ఓ ఐదు నిమిషాల పాటు వేయించాక.. కారం, ఉప్పు, ధనియాల పొడి, మిక్సీ పట్టిన పౌడర్, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి వేసి కాసేపు వేయించాలి. ఇవి బాగా వేగాక.. నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ కు మూత పెట్టి 8 నుంచి 9 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ లో ఆవిరి అంతా పోయాక.. ఒకసారి రుచి చూసి.. తక్కువ అయితే వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి.. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని అన్నం, చపాతీ, రోటి వంటి వాటిల్లో సూపర్ గా ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.