నిమ్మకాయ లేకుండానే లెమన్ టీ.. 2 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి..
మీరు రెగ్యులర్‌గా లెమన్ టీ తాగుతారా..? అయితే వంటింట్లో నిమ్మకాయలు లేవని లెమన్ టీ తాగడం మానేస్తున్నారా? అయితే ఈ సింపుల్ ట్రిక్ మీకోసమే.. నిమ్మకాయ అవసరం లేకుండానే కేవలం రెండే రెండు నిమిషాల్లో అద్భుతమైన టీని తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఉదయం లేవగానే చాలా మందికి వేడివేడిగా ఓ కప్పు టీ తాగే అలవాటు ఉంటుంది. అందులోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేవారు.. బరువు తగ్గాలనుకునేవారు లేదా రిఫ్రెషింగ్‌గా రోజును ప్రారంభించాలనుకునేవారు ఎక్కువగా లెమన్ టీని ఎంచుకుంటారు. రోజువారీ దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ నిమ్మ టీ చేసుకోవడానికి ఒక్కోసారి వంటింట్లో నిమ్మకాయలు లేకపోవచ్చు. తీరా టీ పెట్టుకునే సమయానికి నిమ్మకాయ లేకపోతే ఎక్కడలేని చికాకు వస్తుంది. అయితే అలాంటి సమయాల్లో అస్సలు నిరాశ చెందాల్సిన పనిలేదు. ఇంట్లో నిమ్మకాయ లేకపోయినా.. మీ పెరట్లోనో, బాల్కనీ కుండీలోనో లేదా ఇంటి సమీపంలో ఉండే నిమ్మ మొక్క నుంచి కొన్ని తాజా ఆకులను కోసుకొస్తే చాలు. నిమ్మరసంతో చేసే టీ కంటే కూడా రెట్టింపు సువాసనతో, సరికొత్త రుచితో అద్భుతమైన లెమన్ లీఫ్ టీని నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
- తాజా నిమ్మ ఆకులు: 4 నుండి 5
- టీ పొడి: చిటికెడు
- తేనె లేదా పంచదార: రుచికి సరిపడా
- నీళ్లు: 2 కప్పులు
తయారీ విధానం
- ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద మరిగించాలి.
- నీళ్లు వేడెక్కాక శుభ్రం చేసుకున్న నిమ్మ ఆకులను వేసి, ఆకుల సువాసన నీటికి పట్టేలా ఒకటి నుండి రెండు నిమిషాలు మరగనివ్వాలి.
- ఆ తర్వాత చిటికెడు టీ పొడి వేసి మరో అర నిమిషం మరిగించి స్టవ్ కట్టేయాలి.
- ఇప్పుడు టీని కప్పులోకి వడకట్టి, అందులో రుచికి సరిపడా తేనె లేదా పంచదార కలుపుకుంటే చాలు. సాధారణ నిమ్మరసం టీ కంటే ఎంతో సువాసనభరితమైన లెమన్ లీఫ్ టీ సిద్ధమవుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే గోరువెచ్చని ఈ టీ తాగడం వల్ల కడుపు తేలికగా అనిపిస్తుంది. అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రోగనిరోధక శక్తి: నిమ్మలో లభించే సహజ పోషకాలు, విటమిన్ సి శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడతాయి.
శరీరానికి తేమ: ఇది శరీరానికి తగినంత హైడ్రేషన్ అందిస్తూ, శరీరం లోపల ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
రోజంతా ఉత్తేజం: జీవక్రియను వేగవంతం చేసి, అలసటను దూరం చేసి రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు సహకరిస్తుంది.
ఇంట్లో నిమ్మకాయలు లేనప్పుడు లేదా సరికొత్త రుచిని ఆస్వాదించాలనుకున్నప్పుడు ఈ లెమన్ లీఫ్ టీ చక్కని ప్రత్యామ్నాయం. ఇంకెందుకు ఆలస్యం, మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.
