చేపల ఇగురు రెసిపీ.. ఇలా చేస్తే తిన్న వారంతా ఫిదా అవ్వాల్సిందే..!
చేపల రుచికి అలవాటైన వాళ్లకు చేపల ఇగురు కర్రీ ఒక స్పైసీ ట్రీట్ లా ఉంటుంది. సాధారణ చేపల కూరకన్నా ఈ పద్ధతి భిన్నంగా, మసాలా రుచులతో నిండిపోతుంది. ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో ఈ కర్రీని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ ఇగురు కూర రుచి చూశారంటే..

చేపలంటే ఇష్టపడేవాళ్ళకు చేపల ఇగురు కూర ఒక అద్భుతమైన ఎంపిక. దీని రుచి ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మామూలు చేపల కూరలా కాకుండా.. కాస్త భిన్నంగా, స్పైసీగా ఉండే ఈ ఇగురు కర్రీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- చేప ముక్కలు – ఆరు (మీకు నచ్చిన చేప రకం తీసుకోవచ్చు)
- పసుపు – అర టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- ధనియాల పొడి – ఒక టీస్పూన్
- జీలకర్ర – ఒక టీస్పూన్
- తాజా తురిమిన అల్లం – రెండు టీస్పూన్లు
- కారం – ఒక టీస్పూన్ లేదా మీరు తినేదాన్ని బట్టి
- ఎండు మిర్చి – నాలుగు
- బిర్యానీ ఆకులు – రెండు
- నల్ల జీలకర్ర – పావు టీస్పూన్
- తరిగిన ఉల్లిపాయ – ఒకటి
- పచ్చిమిర్చి – మూడు
- ఆవనూనె – వేయించడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా చేప ముక్కల్ని కాస్త ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత చేప ముక్కలను వేసి నెమ్మదిగా వేయించాలి. అవి గోధుమ రంగు వచ్చే వరకు తిప్పుతూ వేయించి తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి.
ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం చిన్న మిక్సీ జార్ లో కొద్దిగా ధనియాలు, తురిమిన అల్లం, కారం, పసుపు, ఉప్పు వేసి అందులో తగినంత నీరు పోసి బాగా రుబ్బుకోవాలి. మరో వైపు కడాయిలో నూనె వేసి వేడి చేసి అందులో నల్ల జీలకర్ర, ఎండు మిర్చి వేసి మీడియమ్ మంటపై వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకులు, ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తర్వాత ముందే కలిపిన మసాలా మిశ్రమాన్ని అందులో పోసి కొద్దిసేపు మరిగించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన చేప ముక్కలు వేసి వాటిపై తగినంత నీరు పోసి మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా వేడి చేయాలి. పచ్చి మిరపకాయలను చీల్చి అందులో వేసి మూత పెట్టాలి. మంటను తగ్గించి సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఉడికించాలి.
ఈ విధంగా చేసినప్పుడు చేప ముక్కలు మసాలా రుచులతో బాగా నిండిపోతాయి. చిన్న ముక్కలుగా కట్ చేయకుండానే చేపను పూర్తిగా ఉడికించడమూ ఈ పద్ధతిలోనే సులభంగా చేయవచ్చు. చివరగా వేడి వేడిగా వడ్డించేసి అదిరిపోయే రుచిని పొందవచ్చు.




