నిద్రలేవగానే బ్రేక్ ఫాస్ట్ తినకపోతే నిజంగా డేంజరా..? అపోహలు కాదు డాక్టర్లు చెప్పే వాస్తవాలు తెలుసుకోండి..
నిద్ర లేచారా? అయితే గంటలోపు తినేయాల్సిందే.. లేదంటే కొంపలు మునిగిపోతాయి.. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇలాంటి హెల్త్ రూల్స్ మనకు తెగ కనిపిస్తున్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌ను మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అంటారన్నది ఎంత నిజమో.. ఈ 60 నిమిషాల నియమం కూడా అంతే నిజమా? అనేది తెలుసుకుందాం..

‘‘ఉదయం పూట రాజులా తినాలి.. బ్రేక్ ఫాస్ట్ రోజు మొత్తంలో అత్యంత ముఖ్యమైన భోజనం’’ ఇలాంటి మాటలు మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మరో కొత్త రూల్ చక్కర్లు కొడుతుంది. ‘‘నిద్ర లేచిన గంట లోపే ఏదో ఒకటి తినేయాలి, లేదంటే ఆరోగ్యం పాడవుతుంది’’ అనేది ఆ ట్రెండ్ సారాంశం. కానీ నిజంగానే ఉదయం పూట ఆ 60 నిమిషాల మ్యాజిక్ విండో అంత ముఖ్యమా? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? బెంగళూరు అపోలో హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విఠల్ డి. బాగి అందించిన ఆసక్తికర విశేషాలు మీకోసం…
రాత్రి వేళ మన శరీరంలో ఏం జరుగుతుంది?
మనం పడుకున్నప్పుడు శరీరం కూడా పూర్తిగా నిద్రపోతుందని అనుకుంటే పొరపాటే. రాత్రంతా మన శరీరం లోపల నిశ్శబ్దంగా పని జరుగుతూనే ఉంటుంది. శ్వాస తీసుకోవడం, కణాల మరమ్మతులు, హార్మోన్ల నియంత్రణ, గుండె కొట్టుకోవడం వంటి అనేక జీవక్రియల కోసం శరీరం నిరంతరం శక్తిని వాడుకుంటుంది. రాత్రి సమయంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోం కాబట్టి శరీరం తనలో నిల్వ ఉన్న శక్తిని ఉపయోగిస్తుంది. దీనివల్ల ఉదయానికి రక్తంలో చక్కెర స్థాయిలు కొంత తగ్గే అవకాశం ఉంది. అందుకే కొందరికి లేవగానే విపరీతమైన ఆకలి, నీరసం అనిపిస్తే.. మరికొందరు మాత్రం ఎలాంటి ఆహారం లేకుండానే చాలా ఉత్సాహంగా కనిపిస్తారు.
గంట నియమానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా?
‘‘నిద్ర లేచిన గంటలోనే తినాలనే నియమానికి ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు’’ అని డాక్టర్ విఠల్ డి. బాగి స్పష్టం చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పరిశోధనల ప్రకారం.. ‘‘బ్రేక్‌ఫాస్ట్ సమయం అనేది వ్యక్తి వయసు, మెటబాలిజం, వారి ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడు తింటున్నాం అనే దానికంటే, బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. గడియారం ముల్లును చూసి కాకుండా మీ శరీర సంకేతాలను బట్టి తినడం ఉత్తమం” అని డాక్టర్ బాగి సూచించారు.
బ్రేక్‌ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడని వారు ఎవరు?
సమయంతో పట్టింపు లేకపోయినప్పటికీ, కొందరు మాత్రం ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం తప్పనిసరి.
డయాబెటిస్ ఉన్నవారు: రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు కాకుండా ఉండటానికి వీరు సమయానికి తినాలి.
పిల్లలు, యువత: ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేసే పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి బాగుంటాయని, చదువుల్లో రాణిస్తారని సీడీసీ పరిశోధనలు చెబుతున్నాయి.
వ్యాయామం చేసేవారు: ఉదయాన్నే వర్కవుట్స్ చేసేవారికి కండరాల రికవరీ కోసం, తక్షణ శక్తి కోసం అల్పాహారం అవసరం.
బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా తింటే తప్పా?
పెద్దవారు బ్రేక్‌ఫాస్ట్‌ను కొంచెం ఆలస్యంగా తిన్నా లేదా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి పద్ధతులు పాటించినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఆలస్యంగా తింటున్నాం కదా అని ఆకలి ఎక్కువై మధ్యాహ్నం పూట జంక్ ఫుడ్ లేదా అతిగా తినేయడం మంచిది కాదు.
మరి బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఏది?
ఆరోగ్యకరమైన అల్పాహారంలో కింది పోషకాలు సమపాళ్లలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు:
ప్రోటీన్: గుడ్లు, పాలు, పెరుగు, పనీర్ లేదా మొలకెత్తిన గింజలు.
హోల్ గ్రెయిన్స్: ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లేదా హోల్ వీట్ టోస్ట్.
ఫైబర్ – విటమిన్లు: తాజా పండ్లు, కూరగాయలు.
హెల్తీ ఫ్యాట్స్: బాదం, జీడిపప్పు, విత్తనాలు.
అందుబాటులో ఉండే కొన్ని ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ కాంబినేషన్లు
- వెజిటబుల్ ఆమ్లెట్ -హోల్ : వీట్ టోస్ట్
- పాలు, పండ్ల ముక్కలతో చేసిన ఓట్స్
- పల్లీలు, కూరగాయలు వేసిన పోహా
- పెరుగుతో కూడిన బెసన్ చిల్లా
- సాంబార్‌తో కూడిన ఇడ్లీ : ఒక పండు
దేనికి దూరంగా ఉండాలి?
చక్కెర ఎక్కువగా ఉండే సెరియల్స్, పేస్ట్రీలు, స్వీట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి తిన్న వెంటనే శక్తిని ఇచ్చినట్లు అనిపించినా, కాసేపటికే నీరసపడేలా చేస్తాయి. సోషల్ మీడియా ట్రెండ్స్‌ను బ్లైండ్‌గా ఫాలో అవ్వకండి. మీ శరీరం ఇచ్చే ఆకలి సంకేతాలను గౌరవించండి. సమయం కంటే క్వాలిటీ ముఖ్యం.
