అందరూ చేసే మిస్టెక్ మీరు చేయొద్దు.. పాతకాలం పద్దతిలో చికెన్ వండితే నాటుకోడి కూరలా మారిపోయిద్ది..
బ్రాయిలర్ చికెన్‌తో చేసిన కూర నాటుకోడి కూరలా కమ్మగా, స్మోకీ ఫ్లేవర్‌తో రావాలంటే కొన్ని సంప్రదాయ చిట్కాలు పాటించాలి. చికెన్‌ను శుభ్రం చేసే విధానం నుంచి మసాలా తయారీ, గ్రేవీని నెమ్మదిగా ఉడికించడం వరకు ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకుంటే రుచి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చికెన్‌ను మంటపై స్వల్పంగా కాల్చి శుభ్రం చేయడం, ప్రత్యేకమైన మసాలా పేస్ట్ తయారు చేయడం, తక్కువ మంటపై గ్రేవీలో ఉడికించడం వంటి పద్ధతులతో పండుగ వేళ ఇంట్లోనే కమ్మని కోడి కూరను తయారు చేసుకోవచ్చు.

సాధారణంగా నాన్ వెజ్ ప్రియులు చికెన్‌ను ఇష్టంగా తింటారు. కోడి కూర అంటేనే.. నోరూరుపోతుంది. ఆదివారం అనే కాకుండా.. వారంలో రెండు, మూడు సార్లు తింటారు. ఇక పండగల వేళ అయితే.. ఇంకా మంచిగా వండుకుని.. బంధువులంతా కలిసిమెలసి తింటారు. అయితే.. బోనాల లాంటి పండుగల వేళ అన్ని ప్రాంతాలలో సందడి నెలకొంటుంది.. నాటు కోళ్లతోపాటు.. బ్రాయిలర్ కోడి మాంసాన్ని చాలా మంది కొని ఇష్టంగా తింటారు. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే.. బ్రాయిలర్ కోడి మాంసం కూడా నాటుకోడి మాంసం వలే రుచికరంగా ఉంటుందని పేర్కొంటున్నారు పెద్దలు.. పాతకాలం పద్దతిలో వండితే చికెన్ కర్రీ అద్భుతంగా మారుతుందని.. పేర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న పొరపాటు వల్ల దాని సహజమైన, ముఖ్యంగా స్మోకీ ఫ్లేవర్‌ను కోల్పోతుంటారని.. కోడి కూరను సంప్రదాయ పద్ధతిలో పద్దతిలో వండితే అద్భుతంగా వస్తుందంటున్నారు.
కోడి తయారీలో కీలకమైన చిట్కాలు:
సాధారణంగా చికెన్ షాపుల్లో కోడిని వేడినీళ్లలో ముంచి ఈకలు తీసేస్తుంటారు. కానీ నాటుకోడి కూరకు అసలైన రుచి, స్మోకీ ఫ్లేవర్ రావాలంటే ఈ పద్ధతిని అనుసరించకూడదు. ఈకలను మామూలుగా పీకిన తర్వాత, చికెన్‌ను మంటపై కాల్చాలి. పసుపు రాసి, కాల్చి, శుభ్రంగా కడిగి ముక్కలుగా కోయడం వల్ల చికెన్‌కు అద్భుతమైన స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. దీనివల్ల రుచి కూడా చాలా పెరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చర్మంతో పాటు ఉడికించడం వల్ల కూరకు మరింత రుచి, కమ్మదనం వస్తాయి.. వద్దనుకుంటే.. స్కిన్ లెస్ తీసుకోవాలి. చికెన్‌ను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, ఒక చిల్లుల గిన్నెలో వేసి పది నుంచి పదిహేను నిమిషాలు నీరు పూర్తిగా దిగిపోయే వరకు పక్కన పెట్టాలి.
చికెన్‌ను ఉడికించే సంప్రదాయ పద్ధతి:
నీరు దిగిపోయిన తర్వాత, చికెన్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక కిలో చికెన్‌కు సుమారు అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, పావు కప్పు నూనె వేయాలి. మామూలు చికెన్ సులువుగా ఉడుకుతుంది కానీ, నాటుకోడి గట్టిగా ఉంటుంది. దీన్ని మటన్ లాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. పూర్వకాలంలో అమ్మమ్మల కాలంలో ఉపయోగించిన “ఆవగలు వేయడం” అనే పద్ధతిని ఇక్కడ వాడాలి. ఉప్పు, పసుపు, నూనె ముక్కలకు బాగా పట్టేలా మసాజ్ చేసినట్లుగా కలపాలి.
నాటు కోడి అయితే.. నీరు కలపకుండా ప్రెషర్ కుక్కర్‌లోకి మార్చి, రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా మెత్తగా ఉడకకూడదు, సుమారు 80% ఉడికితే సరిపోతుంది. మిగిలిన 20% గ్రేవీలో ఉడుకుతుంది. బ్రాయిలర్ చికెన్ అయితే.. సాధారణంగా వండుకుంటే సరిపోతుంది.
రుచికరమైన మసాలా తయారీ:
కూర గ్రేవీకి మరింత రుచిని చేకూర్చే మసాలాను తయారు చేసుకోవాలి. ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి, దాల్చినచెక్క ముక్కలు, నాలుగు లవంగాలు, రెండు ఇలాచీలు, పది మిరియాలు, అల్లం (మూడు అంగుళాల ముక్క), పది వెల్లుల్లి రెబ్బలు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కొన్ని సెకన్లు వేయించాలి. ఆ తర్వాత పది నుంచి పదిహేను జీడిపప్పులు, ఒక స్పూన్ గసగసాలు చేర్చాలి. ఇవి గ్రేవీకి మంచి రుచిని, చిక్కదనాన్ని ఇస్తాయి. రెండు మధ్యస్థాయి టమాటాలు, పావు స్పూన్ ఉప్పు వేసి, రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి. పదార్థాలు పూర్తిగా ఉడకనవసరం లేదు, మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మగ్గితే చాలు. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
కోడి కూర తయారీ విధానం:
మరొక కడాయిలో పావు కప్పు నూనె వేసి, చిన్న దాల్చినచెక్క ముక్క, రెండు లవంగాలు, ఒక ఇలాచి వేయాలి. పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం వేసి కొన్ని సెకన్లు వేయించాలి. కారం మాడిపోకుండా చూసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. మిక్సీ జార్‌లో కొద్దిగా నీరు పోసి ఆ మసాలాను కూడా వేస్ట్ అవ్వకుండా కడాయిలోకి చేర్చాలి. ఈ మసాలాను తక్కువ మంటపై రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
గ్రేవీకి తగినంత నీరు (సుమారు 750 మి.లీ) కలిపి మరిగించాలి. మరుగుతున్న గ్రేవీలో చికెన్ ముక్కలను వేసి, ఎక్కువగా కలపకుండా, గ్రేవీలో మునిగేలా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే పావు స్పూన్ ఉప్పు వేయాలి. పైన కొత్తిమీర చల్లి, మూత పెట్టి ఎనిమిది నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించుకోవాలి. కూర పూర్తిగా సిద్ధమైందని నూనె పైకి తేలడం, గుమగుమలాడే వాసన రావడం వంటి లక్షణాలతో తెలుస్తుంది. గ్రేవీ చల్లారే కొద్దీ మరింత చిక్కబడుతుంది కాబట్టి, కొంచెం పల్చగా ఉండేలా చూసుకోవాలి.
ఈ అద్భుతమైన నాటుకోడి కూర బగారా రైస్, పులావ్ రైస్, లేదా రాగి ముద్దతో అద్భుతంగా ఉంటుంది. ఈ పద్ధతిలో తయారు చేస్తే కమ్మని, రుచికరమైన నాటుకోడి కూరను ఆస్వాదించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
