
చలికాలం వచ్చిందంటే చాలు.. చిన్న పిల్లల తల్లులకు ఒకటే ఆందోళన. మారుతున్న వాతావరణం వల్ల పిల్లలు త్వరగా జలుబు, దగ్గు బారిన పడుతుంటారు. ఇలాంటప్పుడు వారి ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో తల్లులు పిల్లలకు దూరంగా పెట్టే ప్రధానమైన ఆహారం అరటిపండు. అరటిపండు తింటే శ్లేష్మం పెరుగుతుందని, దగ్గు ఎక్కువవుతుందని చాలామంది నమ్ముతారు. కానీ ఇందులో నిజమెంత? చలికాలంలో అరటిపండు పెట్టడం సురక్షితమేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
నిజానికి జలుబు లేదా దగ్గు అనేవి వైరస్ల ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు. ఏ పండు కూడా నేరుగా జలుబును కలిగించదు. అరటిపండు తినడం వల్ల శరీరంలో శ్లేష్మం పెరుగుతుందని నిరూపించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అరటిపండు తిన్నప్పుడు గొంతులో కొంచెం బిగుతుగా అనిపించడం సహజం. అది కేవలం ఆ పండు ఆకృతి వల్ల కలిగే అనుభూతి మాత్రమే తప్ప కఫం కాదు.
పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు నీరసించి పోతుంటారు. ఏమీ తినడానికి ఇష్టపడరు. అలాంటి సమయంలో అరటిపండు వారికి ఒక వరంలా పనిచేస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తుంది. అరటిపండు మెత్తగా ఉండటం వల్ల గొంతు నొప్పి ఉన్న పిల్లలు కూడా దీనిని సులభంగా తినగలరు. ఇందులోని విటమిన్ సి, విటమిన్ B6 రోగనిరోధక శక్తిని పెంచి వైరస్‌తో పోరాడటానికి సహాయపడతాయి. శరీరంలోని ఖనిజ లవణాల సమతుల్యతను కాపాడుతుంది.
పిల్లలకు అరటిపండు పెట్టినప్పుడు ఒకవేళ విరేచనాలు అవుతుంటే మాత్రం తాత్కాలికంగా ఆపేయడం మంచిది. చలికాలంలో ఏ ఆహారమైనా మితంగా ఇవ్వాలి. రోజుకు ఒకటి లేదా సగం అరటిపండును మ్యాష్ చేసి ఇవ్వడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టిన అరటిపండ్లను నేరుగా పిల్లలకు ఇవ్వకండి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పండ్లను మాత్రమే ఇవ్వండి.
అరటిపండు ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. అనవసరమైన అపోహలతో పిల్లలకు ఈ పోషకాలను దూరం చేయకండి. జలుబు చేసినప్పుడు ఆకలిగా లేని పిల్లలకు అరటిపండు ఒక మంచి ప్రత్యామ్నాయం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..