మనం తీసుకునే ఆహారంలో శరీరానికి కావాలసిన పోషకాలు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మనం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పోషకాల కోసమే నిత్యం పండ్లు, కూరగాయలను తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇక శరీరానికి కావలసిన పోషకాలలో కాల్షియం కూడా ప్రముఖమైనది. శరీరంలో కాల్షియం లోపం ఏర్పడితే ఎముకలు, కండరాల పటిష్టతను కోల్పోతాయి. ఎందుకంటే ఎముకలు, కండరాల పటిష్టతను కాపాడడంలో ఉపయోగకరంగా ఉండేది ఈ మినరల్‌యే. ఇంకా ఈ కాల్షియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ, శరీరంలోని పీహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ కాకపోతే కడుపు మంట, గ్యాస్ట్రిక్ వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. అలాగే శరీరంలో తగినంత కాల్షియం ఉంటే మీ దంతాలు కూడా బలోపేతమవుతాయి. ఇంకా కండరాల నొప్పులు కూడా నయమవుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే కాల్షియం మనం శరీరంలో ఉండాలని తెలిసింది కదా.. మరి కాల్షియం కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల నువ్వులు: నల్ల నువ్వుల్లో కాల్షియం, విటమిన్ బీ కాంప్లెక్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నువ్వుల లడ్డూలు వంటివి ఎక్కువగా పండగల సమయంలో చేస్తారు. పిల్లలకు తరచూ ఇవి చేసివ్వడం వల్ల కాల్షియం వారికి తగినంతగా అందుతుంది.
పెరుగు: పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో ఎప్పుడూ పెరగు అందుబాటులో ఉంచుకుంటే పిల్లలకు కావలసిన కాల్షియం లభిస్తుంది. పిల్లల్లో కాల్షియం లోపం ఏర్పడకుండా ఉండాలంటే.. పెరుగన్నం తప్పనిసరిగా తినేలా వారిని ప్రోత్సహించాలి.
పప్పుధాన్యాలు: రాజ్మా, కాబూలీ శనగలు, శనగలు, అలసందల్లో కాల్షియం విరివిగా ఉంటుంది. వీటిని టమాటా, ఉల్లితో కలిపి వండి అన్నంలో గానీ, చపాతీలో గానీ ఇవ్వొచ్చు.
కూరగాయలు: మెంతి, బ్రొకలీ, పాలకూర, బచ్చలికూర, ముల్లంగి వంటి వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీరలో కూడా కాల్షియం ఉంటుంది. పుదీనా, కొత్తిమీర చట్నీ తరచుగా చేస్తుంటే శాండ్‌విచ్ లేదా అన్నంతో కలిపి ఇవ్వొచ్చు.
గింజలు: వాల్‌నట్స్, అత్తి పండ్లు, ఖర్జూరాలు, ఆప్రికాట్లలో కాల్షియం, ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు ఉంటాయి. స్నాక్స్ రూపంలో వీటిని తరచుగా ఇవ్వడం వల్ల పిల్లల ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..