పచ్చ ద్రాక్ష Vs నల్ల ద్రాక్ష.. ఆరోగ్యానికి ఏది మంచిది.. ఎందులో పోషకాలు ఎక్కువ ఉంటాయో తెలుసా..?
Black Grapes vs Green Grapes: నల్ల ద్రాక్ష అధిక పోషకాలు, అదనపు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటివి ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యం, జ్ఞాపకశక్తి పెంపు, మధుమేహం నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు, క్యాన్సర్ నిరోధకత, ఎముకల బలం, చర్మ సౌందర్యానికి నల్ల ద్రాక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. పచ్చ ద్రాక్ష - నల్ల ద్రాక్షలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకుందాాం..

సాధారణంగా మార్కెట్లో పచ్చ ద్రాక్ష ఎక్కువగా కనిపిస్తుండటంతో చాలా మంది దానినే తింటారు. అయితే పచ్చ ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షలో ఎక్కువ పోషకాలు, అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పచ్చి ద్రాక్షకు బదులుగా అప్పుడప్పుడు నల్ల ద్రాక్షను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. ద్రాక్షలో సాధారణంగా యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అయితే నల్ల ద్రాక్షలో ఈ పోషకాల మొత్తం మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చ ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సి లు అధికంగా లభిస్తాయి. వీటితో పాటు విటమిన్ K, C, B1, B6, మాంగనీస్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి.
నల్ల ద్రాక్ష ప్రత్యేక ప్రయోజనాలు నల్ల ద్రాక్షను తినడం వల్ల లభించే కొన్ని అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి:
జ్ఞాపకశక్తి పెంపు: నల్ల ద్రాక్ష తెలివితేటలను పెంపొందించడంలో సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడేవారు వీటిని తప్పకుండా తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
గుండెకు రక్షణ: నల్ల ద్రాక్ష రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని పెంచుతుంది. ఇది రక్త నాళాలలో ఏర్పడే అడ్డంకులను తొలగించి, రక్తం సజావుగా ప్రవహించేలా చేస్తుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.
మధుమేహం నియంత్రణ: నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే ప్రత్యేక సమ్మేళనం ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. దీని ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో డయాబెటిక్ రోగుల ఆహార ప్రణాళికలో కూడా వీటిని చేర్చుతారు.
కొలెస్ట్రాల్ తగ్గింపు: ఇవి కొవ్వు జీవక్రియను పెంచి, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి దోహదపడతాయి.
క్యాన్సర్ నిరోధకత: గుండె జబ్బులతో పాటు, ఈ ద్రాక్ష క్యాన్సర్‌కు నిరోధకతను పెంచే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
ఎముకల బలం: నల్ల ద్రాక్ష ఎముకల నిర్మాణంలో సహాయపడి, వాటిని బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
డీటాక్సిఫికేషన్: నల్ల ద్రాక్ష మూత్ర నాళాన్ని శుభ్రపరచడం ద్వారా శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
చర్మ సౌందర్యం: నల్ల ద్రాక్ష చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలోని విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడమే కాకుండా మొటిమలు రాకుండా కాపాడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరుకు మద్దతు ఇవ్వడం వంటి కారణాల వల్ల పచ్చి ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షకు ప్రత్యేక స్థానం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




