AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి..

పండగలప్పుడు లేదా సాధారణ సమయంలో చిక్కబడకుండా, క్రీమీగా ఉండే సేమియా పాయసం తయారు చేయడం ఎలాగో తెలుసా? ఈ ప్రత్యేక రెసిపీతో చల్లారినా గట్టిపడని పాయసం సిద్ధం చేసుకోండి. పక్కా కొలతలతో, 10-15 నిమిషాల్లో ప్రసాదానికి లేదా స్పెషల్ డేస్ కి పర్ఫెక్ట్ రుచికరమైన పాయసం రెసిపీ గురించి తెలుసుకుందాం..

పాలు విరగవు, చల్లారినా చిక్కబడడు.. ఈసారి సేమియా పాయసం ఇలా చేయండి..
Semiya Payasam Recipe
Shaik Madar Saheb
|

Updated on: Sep 25, 2026 | 9:36 AM

Share

పండగొచ్చినా.. చుట్టాలొచ్చినా.. ప్రత్యేక సందర్భంతో పాటు ఎప్పుడైనా ఇష్టంగా తినాలనుకుంటే.. సేమియా పాయసం బెస్ట్ ఆప్షన్.. అప్పటికప్పుడు తయారు చేసుకునే కమ్మని సేమియా పాయసం.. కొన్ని చిట్కాలతో చేస్తే అద్భుతంగా మారుతుంది. అయితే.. చిక్కబడకుండా.. పాలు విరగకుండా తాయరు చేయడం అనేది మెలకువలతోనే సాధ్యం.. సేమియా పాయసం చల్లారినా కూడా అస్సలు చిక్కబడకుండా, క్రీమీగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో ఈ కథనంలో తెలుసుకుందాం.. కేవలం 10-15 నిమిషాల్లో ఈ రుచికరమైన స్వీట్‌ని సిద్ధం చేసుకోవచ్చు.

ఈ సేమియా పాయసం తయారీకి ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి అవి కూడా దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే గిన్నెలోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, ఒక కప్పు సేమ్యాను చేర్చి సన్నని మంటపై నిదానంగా వేయించడం చాలా ముఖ్యం. సేమ్యాను ఎంత బాగా వేయిస్తే పాయసం రుచి, టెక్స్‌చర్ అంత అద్భుతంగా ఉంటాయి. సేమ్యా అంతా ఒకే రంగులో దోరగా వేగేలా గరిటెతో కలుపుతూ ఉండాలి.

సేమ్యా వేగే సమయంలోనే, మరొక స్టవ్‌పై ఒక కప్పు నీళ్ళు తీసుకుని మరిగించాలి. సేమ్యా చక్కగా వేగిన తర్వాత, మరిగించిన నీళ్లను అందులో పోయాలి. సేమ్యా 50% ఉడికే వరకు లైట్‌గా కుక్ చేయాలి. ఆ తరువాత, నాలుగు కప్పుల కాచి చల్లార్చిన పాలను పోసి, పాలు పొంగి సేమ్యా 90% ఉడికే వరకు మీడియం మంటపై గరిటెతో కలుపుతూ ఉడికించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన చిట్కా ఏమిటంటే, సేమ్యా పూర్తిగా మెత్తగా ఉడికిపోకుండా కాస్త పలుకుగా ఉండగానే తదుపరి స్టెప్ కి వెళ్లాలి. సేమ్యాను ఎక్కువగా ఉడికిస్తే పాయసం చల్లారిన తర్వాత బాగా చిక్కబడుతుంది.

సేమ్యా 90% ఉడికిన తర్వాత అర కప్పు పంచదార వేసి, పంచదార పూర్తిగా కరిగే వరకు మీడియం మంటపై కలుపుతూ ఉండాలి. క్రీమీ టెక్స్‌చర్ కోసం రెండు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ కలపమని సూచించారు. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే దానికి బదులుగా ఒక టేబుల్ స్పూన్ అదనపు పంచదార వేసుకోవచ్చు. అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆపివేయాలి. చివరిగా, చిటికెడు ఉప్పు (తీపిని బ్యాలెన్స్ చేయడానికి), అర టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపితే కమ్మని సేమియా పాయసం సిద్ధం అవుతుంది.

ఈ పాయసం చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉండాలంటే, సర్వ్ చేసే ముందు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కలుపుకోవాలి. ఈ పద్ధతిని పాటించడం వల్ల పాయసం అస్సలు గట్టిపడదు. ఈ సులభమైన, పక్కా రెసిపీతో మీ ఇంటి పండగలకు, ప్రసాదాలకు రుచికరమైన, చిక్కబడని సేమియా పాయసాన్ని తయారు చేసి అందరినీ ఆకట్టుకోండి.

Follow Us