AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా..? అసలు నిజాలు తెలుసుకోండి..

పండ్లలో రాజు.. రుచిలో సాటిలేనిది.. చూస్తేనే నోరూరించే మామిడి మార్కెట్లో సందడి చేస్తోంది. అమృతం లాంటి ఈ మామిడి పండును అతిగా తింటే సమస్యలు తప్పదా? మామిడి పండు తింటే బాడీ హీట్ పెరుగుతుందన్నది నిజమేనా? అస్సలు మామిడిని ఎలా తింటే ఆరోగ్యం? ఎలా తింటే అనారోగ్యం? దీని వెనుక ఉన్న అసలు నిజానిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా..? అసలు నిజాలు తెలుసుకోండి..
Does Eating Mangoes Increase Body Heat
Krishna S
|

Updated on: May 03, 2026 | 9:28 AM

Share

ఎండలు మండిపోతున్న ఈ సమయంలో ప్రకృతి మనకు అందించిన తియ్యని కానుక మామిడి పండు. దీని రుచికి ఫిదా అవ్వని వారుండరు. కానీ మామిడి పండ్లు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని, మొటిమలు వస్తాయని చాలా మంది భయపడుతుంటారు. దీంట్లో నిజం లేకపోలేదు. అవును, మామిడి పండు తిన్నప్పుడు శరీరంలో వేడి పెరగడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. దీనిని థర్మోజెనిక్ ప్రభావం అంటారు. మామిడిలో ఉండే సహజ చక్కెరలను జీర్ణం చేసుకోవడానికి మన శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రతువులో జీవక్రియ వేగవంతమై శరీరంలో వేడి పుడుతుంది. అందుకే అతిగా మామిడి పండ్లు తిన్నప్పుడు వేడి చేసినట్లు అనిపిస్తుంది.

అతిగా తింటే వచ్చే ముప్పులివే

రుచిగా ఉంది కదా అని మామిడిని ఎక్కువగా లాగిస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు..

షుగర్ పెరిగే ఛాన్స్: మామిడి పండ్లకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

జీర్ణ సమస్యలు: ఇందులో పీచు అధికంగా ఉండటం వల్ల అతిగా తింటే విరేచనాలు, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

చర్మ సమస్యలు: బాడీ హీట్ పెరగడం వల్ల కొంతమందిలో మొటిమలు, వేడి పొక్కులు మరియు చర్మపు దద్దుర్లు వస్తాయి.

బరువు పెరగడం: ఇందులో కేలరీలు ఎక్కువ కాబట్టి, డైటింగ్‌లో ఉన్నవారు పరిమితి దాటితే బరువు పెరిగే అవకాశం ఉంది.

కృత్రిమ మామిడి.. తస్మాత్ జాగ్రత్త

మార్కెట్లో డిమాండ్‌కు తగ్గట్టుగా చాలా మంది వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాలతో మామిడిని పండిస్తున్నారు. ఇలాంటి పండ్లు తింటే తలతిరగడం, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు వస్తాయి. మామిడి కాడ దగ్గర వచ్చే జిగురు తగిలితే పెదవుల వద్ద వాపు, దురద రావచ్చు. దీనిని మామిడి దురద అంటారు.

ఆరోగ్యకరంగా తినాలంటే.. డాక్టర్ల సూచనలు ఇవే

నీటిలో నానబెట్టండి: మామిడి పండ్లను తినడానికి కనీసం అరగంట ముందు చల్లటి నీటిలో నానబెట్టాలి. దీనివల్ల వాటిలో ఉన్న కారం తగ్గి, వేడి చేయకుండా ఉంటుంది.

పరిమితి ముఖ్యం: రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు, లేదా ఒక చిన్న సైజు పండు తినడం ఉత్తమం.

సరైన సమయం: మామిడి పండ్లను రాత్రి పూట తినడం కంటే, పగటిపూట స్నాక్ లాగా తీసుకోవడం జీర్ణక్రియకు మంచిది.

తొక్క తీసేయండి: పండ్లను శుభ్రంగా కడిగి, తొక్కను పూర్తిగా తీసేసి తినడం వల్ల అలర్జీలను నివారించవచ్చు.

మామిడి పండును సరైన పద్ధతిలో, మితంగా తీసుకుంటే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సీజన్‌లో ప్రకృతి అందించిన ఈ మధుర ఫలాన్ని ఎంజాయ్ చేయండి, కానీ ఆరోగ్య సూత్రాలను మరువకండి.

Follow Us