
పాలు ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలలోని కాల్సియం, విటమిన్ డి ఎముకలను దృఢంగా మారుస్తాయి. అంతేకాకుండా ప్రతీ రోజూ పాలను క్రమం తప్పకుండా తాగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పాలకు సంబంధించి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. అలాంటి వాటిలో పాలు తాగితే బరువు పెరుగుతారనేది ఒకటి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు పాలు తాగితే బరువు పెరుగుతారని కొందరు నమ్ముతారు. ఇంతకీ ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రిపూట పాలు తాగి పడుకుంటే మంచి నిద్రను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే రాత్రి పాలు తాగితే బరువు పెరుగుతారనే దాంట్లో నిజం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. పాలలో పెద్ద మొత్తంలో లాక్టోస్ మరియు ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి రాత్రిపూట తాగితే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు పాలలో కనీసం 120 కేలరీలు ఉంటాయి. రాత్రి పాలు తాగిన వెంటనే నిద్రపోవడం వల్ల ఆ కేలరీలు ఖర్చుకావు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే వీలైనంత వరకు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పాలను తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య పాలు తాగడం వల్ల చాలా మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు కూడా రాత్రిపూట పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, ఊబకాయంతో బాధపడుతున్న రాత్రి పాలు తాగకపోవడమే మంచిది. ఇక తిన్నవెంటనే తాగే పాలు ఎట్టి పరిస్థితుల్లో చల్లగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.