
ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుంది . ఈ సమస్య ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సరైన ఆహారం నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలియే ఇందుకు ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ కేవలం ఒక పండు తినడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని మీకు తెలుసా? ప్రతిరోజూ నారింజ పండ్లు తినడం వల్ల ఫ్యాటీ లివర్‌ను నియంత్రించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
న్యూట్రియెంట్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో.. 30 నుండి 65 సంవత్సరాల వయస్సు గల 60 మందిని పరీక్షించారు. వారిలో సగం మందికి నాలుగు వారాల పాటు ప్రతిరోజూ సుమారు 400 గ్రాముల గింజలు లేని నారింజ పండ్లను ఇచ్చారు. ఈ బృందం కాలేయంలో కొవ్వు తగ్గడంతో పాటు, కాలేయ ఆరోగ్యం మెరుగుపడిన సూచికలు కనిపించాయి.
గింజలు లేని నారింజలను సాధారణంగా నావెల్ ఆరెంజెస్ అని పిలుస్తారు. ఇది ఒక రకమైన గింజలు లేని నారింజ. వీటి ఉత్పత్తి స్పెయిన్‌లో జరుగుతుంది. ఇది తీపిగా ఉంటుంది. విటమిన్ సి, పాలీఫెనాల్స్ ఇందులో దండిగా ఉంటాయి. ఈ పోషకాలు జీవక్రియను మెరుగుపరచడానికి, కాలేయం చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. ఈ నారింజలలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీర నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే కేవలం నారింజ పండ్లు మాత్రమే ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నయం చేయగలవని చెప్పడం సరికాదని నిపుణులు అంటున్నారు.
ఈ నారింజ పండు మన దేశంలో కూడా లభిస్తాయి. వైద్యుల సలహా మేరకు వీటిని ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారికి సహాయకరంగా ఉంటుంది. కానీ జ్యూస్ రూపంలో కాకుండా, పండును నేరుగా తినడం మంచిది. అంతేకాకుండా మధుమేహం ఉన్నవారు నారింజ పండ్లను మితంగా తీసుకోవాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు నారింజ పండ్లను తీసుకోవడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 తెలుగు దీనిని నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.