
కొబ్బరి నీరు ప్రకృతి అందించిన అమృతం. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే వీటిని అన్ని వయసుల వారు తాగుతుంటారు. అయితే కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేసిన తర్వాత తక్షణ శక్తి కోసం వీటిని తాగొచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాదు చర్మ కాంతిని పెంచడం నుంచి జీర్ణక్రియ వరకు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కానీ అమృతం లక్షణాలతో కూడిన ఈ పానీయం కొందరికి మాత్రం విషంతో సమానం. అంటే ఈ సహజ పానీయం కొంతమంది ఆరోగ్యాన్ని మరింత దిగజార్చి ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి కొబ్బరి నీళ్లు ఎవరికి మంచిది కాదో ఇక్కడ తెలుసుకుందాం..
కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న గ్లాసు (అంటే 200 మి.లీ)లో దాదాపు 6 నుంచి 7 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది పండ్ల రసాల కంటే తక్కువ. కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు తక్కువ పరిమాణంలో మాత్రమే కొబ్బరి నీళ్లు తాగాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ముఖ్యంగా కొన్ని కొబ్బరి నీళ్లలో చక్కెర కలిపి తాగారో.. పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉంటే కొబ్బరి నీళ్ళు తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అలెర్జీలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కొబ్బరి నీళ్లకు అలెర్జీలు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, తగినంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి కొబ్బరి నీళ్ళు తాగిన వెంటనే చర్మంపై దురద, వాపు, ఎరుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలను కలిగిస్తుంది. పిల్లలకు కొబ్బరి నీళ్ల అలెర్జీలు వచ్చే అవకాశం మరింత ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత మీకు ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి కొబ్బరి నీరు మంచిది కాదు. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఉంటుంది. ఇది ఆరోగ్యవంతులకు మంచిదే అయినప్పటికీ, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. దెబ్బతిన్న మూత్రపిండాలు అదనపు పొటాషియంను ఫిల్టర్ చేయడానికి అధికంగా కష్టపడతాయి. ఇది రక్తంలో పేరుకుపోతుంది. ఇది హైపర్‌కలేమియాకు కూడా దారితీస్తుంది. కండరాలు, గుండెను ప్రభావితం చేసే పరిస్థితి కూడా తలెత్తుతుంది. బలహీనత, వికారం తీవ్రమైన సందర్భాల్లో క్రమరహిత హృదయ స్పందన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
జలుబు, ఫ్లూ ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది శరీరాన్ని త్వరగా చల్లబరుస్తుంది. కాబట్టి వేసవి రోజుల్లో తాగడానికి బాగున్నప్పటికీ జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది మంచిది కాదు. దీని చల్లబరిచే స్వభావం శ్లేష్మం మొత్తాన్ని పెంచడమే కాకుండా శరీరానికి వెచ్చదనం అవసరమైనప్పుడు శరీరాన్ని చల్లబరుస్తుంది. కాబట్టి అనారోగ్యంతో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కొబ్బరి నీళ్లకు బదులుగా అల్లం టీ లేదా వేడి సూప్‌లు తాగడం మంచిది.
అధిక రక్తపోటు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కొబ్బరి నీళ్ళలోని పొటాషియం కంటెంట్ కారణంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు. అయితే రక్తపోటు మందులు ముఖ్యంగా ACE ఇన్హిబిటర్లు లేదా పొటాషియం-స్పేరింగ్ డైయూరిటిక్స్ తీసుకునే వారికి కొబ్బరి నీళ్ళు ప్రమాదకరం. ఈ మందులు పొటాషియం స్థాయిలను పెంచుతాయి. కొబ్బరి నీళ్ళు వాటిని మరింత పెంచుతాయి. ఇది ఛాతీ నొప్పి, కండరాల తిమ్మిరి, క్రమరహిత హృదయ స్పందనకు కారణమవుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.