Chicken: చికెన్‌లో బ్రెస్ట్ మంచిదా.. లెగ్ పీస్ మంచిదా..? పే.. ద్ద.. కథే ఉందిగా..
చికెన్ ను నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు. చికెన్ తో పలు రకాల వంటకాలను తయారు చేసుకుని.. ఆస్వాదిస్తుంటారు.. అయితే.. చికెన్ బ్రెస్ట్, లెగ్ పీస్‌లలో ఏది ఆరోగ్యకరమైనదోనన్న ప్రశ్న తరచూ తలెత్తుతుంటుంది. చికెన్ బ్రెస్ట్ లేదా.. చికెన్ లెగ్ పీస్ ఆరోగ్యానికి ఏది మంచిది.. దేనిలో ఎన్ని పోషకాలు ఉన్నాయి.. అనే వివరాలను తెలుసుకుందాం..

చికెన్ అంటే.. చాలు చాలా మంది నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు.. ఫ్రై, కర్రీ, చికెన్ 65.. మసాలా ఇలా అనేక రకాలుగా తయారు చేసుకుని తింటారు.. ముఖ్యంగా.. చికెన్ ప్రపంచవ్యాప్తంగా, అలాగే మన దేశంలో అత్యధికంగా వినియోగించే మాంసాలలో ఒకటి. ఎక్కడ చూసినా చికెన్ ప్రియులకు కొదువ లేదు.. చాలామంది వారానికి రెండు మూడుసార్లు కూడా దీనిని తింటారు. ఫిట్‌నెస్ పట్ల శ్రద్ధ ఉన్నవారు ప్రొటీన్ కోసం చికెన్‌ను ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే, చికెన్ కొనేటప్పుడు కొందరు రుచి కోసం ప్రత్యేకంగా లెగ్ పీస్‌లను అడుగుతారు. మరికొందరు బ్రెస్ట్ పీసెస్ తీసుకుంటారు.. రుచి మాట పక్కనపెడితే, ఆరోగ్యానికి ఏది ఉత్తమం అనే ప్రశ్న తరచుగా వస్తుంది.
డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. చికెన్ లెగ్ పీస్‌ల కంటే బ్రెస్ట్ పీస్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 31 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇదే పరిమాణంలోని చికెన్ లెగ్ పీస్‌లో మాత్రం 26 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. కేలరీల విషయానికి వస్తే, 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 165 కేలరీలు ఉండగా, ఇందులో 80 శాతం ప్రొటీన్ నుండి, 20 శాతం కొవ్వు నుండి వస్తాయి. మరోవైపు, 100 గ్రాముల చికెన్ లెగ్ పీస్‌లో 209 కేలరీలు ఉంటాయి, ఇందులో 53 శాతం మాత్రమే ప్రొటీన్ నుండి, మిగతా 47 శాతం కొవ్వు నుండి వస్తాయి..
ఈ గణాంకాలను బట్టి చూస్తే, చికెన్ బ్రెస్ట్‌లో ప్రొటీన్ శాతం ఎక్కువగా, కేలరీలు, కొవ్వు శాతం తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి లేదా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి చికెన్ బ్రెస్ట్ ఉత్తమ ఎంపిక అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. శారీరక అవసరాలు, పోషకాలను బట్టి.. చికెన్ బ్రెస్ట్ లేదా.. లెగ్ పీసులను ఎంచుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




