
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థిక వేత్త, దౌత్య వేత్త. ఆయన ఆర్థిక శాస్త్రంతోపాటు నీతి శాస్త్ర పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం అందించారు. జీవితంలో విజయం సాధించాలంటే వ్యక్తి లక్షణాలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే విషయాలను స్పష్టంగా తెలియజేశారు. ప్రతి వ్యక్తికి కొన్ని లోపాలు ఉంటాయి. కానీ, వాటిని సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు చాణక్యుడు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబున్నారు. లేదంటే వాటికి బానిసై జీవితం మొత్తం నాశనమవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే అలాంటి అలవాట్లకు మొదట్నుంచీ దూరంగా ఉంటే జీవితం సాఫీగా సాగుతుందంటున్నారు. వ్యక్తి ఏవైనా ప్రలోభాలకు గురైతే అతని జీవితంతోపాటు అతడ్ని నమ్ముకున్న వారి జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.
జీవితంలో డబ్బు అవసరమే కానీ.. ప్రతీది డబ్బుతో కొనలేమని చాణక్యుడు చెబుతారు. డబ్బు సంపాదన కోసం జీవిస్తే.. జీవితంలో ఆనందం, శాంతి దూరమవుతాయని చెప్పారు. చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన ప్రలోభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తికి డబ్బు అవసరమే, కానీ ఒక వ్యక్తి జీవితంలో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉండదని చెప్పాడు . కాబట్టి, మీరు అన్నింటినీ వదిలి డబ్బు సంపాదించడం కోసం మాత్రమే ప్రయత్నిస్తే.. అది పెద్ద ప్రలోభమే అవుతుంది. మీరు కొంత కాలం తర్వాత ఈ విషయంలో మీరు చాలా బాధపడవచ్చు. ఈ ప్రలోభాలానికి గురైతే.. మీరు మీ ఆరోగ్యం, ఆనందం, శాంతి, స్నేహితులు, అన్నీ కోల్పోతారని చాణక్యుడు హెచ్చరించాడు.
హోదా, ప్రతిష్ట అనేవి ప్రతి వ్యక్తి కోరుకునే విషయాలేనని చాణక్యుడు చెప్పారు. అయితే, హోదా, ప్రతిష్ట పొందడానికి ప్రజలు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని.. కానీ, దీని కారణంగా ఒక రోజు ఆ వ్యక్తి పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. చాలా మంది సమాజంలో తమకంటూ పేరును సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు.. కానీ అలాంటి వ్యక్తులు తమను తాము మోసం చేసుకుంటున్నారని చాణక్యుడు చెప్పారు. హోదా, ప్రతిష్ట కోసం వెళితే.. జీవితంలో ఆనందం దూరమవుతుందన్నారు.
ఒక వ్యక్తి జీవితంలో అనేక సంబంధాలు ఉంటాయని, అవి మన స్వార్థం వల్లనే కొనసాగుతాయని చాణక్యుడు చెబుతున్నారు. స్వార్థం ముగిసిన తర్వాత అలాంటి వ్యక్తులు స్వయంచాలకంగా దూరమవుతారు. కానీ, తరచుగా ఈ సంబంధం స్వార్థం ఆధారంగానే కొనసాగుతుందనే ఆలోచన మనకు ఉంటుంది. అయినప్పటికీ మన మనస్సు అలాంటి సంబంధాలలో కొనసాగుతుంది. అందుకే అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించాడు.
భౌతిక సుఖాల ఉచ్చులో ప్రజలు ఎప్పుడూ చిక్కుకోకూడదని చాణక్యుడు హెచ్చరించారు. ఎందుకంటే భౌతిక సుఖాలకు అంతం ఉండదు. అవి పెరుగుతూనే ఉంటాయి. అందుకే ఈ ప్రలోభాలకు గురైతే మీ జీవితంలో చాలా పెద్ద తప్పు చేసినవారవుతారని హెచ్చరించారు.
(Declaimer: ఈ వార్తలోని సమాచారాన్ని అందుబాటులోని వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)