
చలికాలంలో కాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుంది. కాలీఫ్లవర్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకుని చాలా మంది ఇష్టం తింటారు. కాలీఫ్లవర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. విటమిన్ సి తో పాటు, ఫోలేట్, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నా, దీనిని అతిగా తినడం వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం..
కాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకునే ముందు, దాని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను ముందుగా తెలుసుకుందాం. కాలీఫ్లవర్‌లో ఇండోల్-3 కార్బినాల్, సల్ఫోరాఫేన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలీఫ్లవర్‌లో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని, బీపీని అదుపులో ఉంచుతుంది. దీనిలో ఫైబర్ ఉన్నందున, జీర్ణవ్యవస్థ సజావుగా ఉంటుంది. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలీఫ్లవర్ ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా వీటిని పచ్చిగా తింటే పొట్టలో గ్యాస్ సమస్య, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.
క్రూసిఫరస్ కూరగాయల్లో రాఫినోస్ ఉంటుంది. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్స్ ఉన్న కూరగాయను తింటే అది జీర్ణం కాకుండానే పేగుల్లోకి చేరుతుంది. అక్కడ ఉండే బ్యాక్టీరియా వల్ల అవి పులియడం ప్రారంభిస్తాయి. దాంతో కడుపులో మంట ప్రారంభమవుతుంది. అంతేకాకుండా కాలీఫ్లవర్‌లో గ్లూకోసినోలేట్స్ అనే సల్ఫర్ కలిగిన రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు కడుపులోకి ప్రవేశించినప్పుడు, అవి హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఇది కడుపులో వాయువును సృష్టిస్తుంది. అందువల్లనే, కాలీఫ్లవర్ తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
కాలీఫ్లవర్ వంటి కూరగాయలు గ్రంథుల పనితీరుకు ఆటంకం కలిగిస్తాయి. హైపోథైరాయిడిజం వంటి సమస్యలతో బాధపడేవారు కాలీఫ్లవర్ తినకపోవడం మంచిది.
కొందరికి కాలీఫ్లవర్ తినడం వల్ల అలర్జీ వస్తుంది. అలాంటప్పుడు చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.