Walking for Weight Loss: రోజూ 1 కిలోమీటర్ వాకింగ్ చేస్తే.. నెల తర్వాత మీ బరువు ఎంత తగ్గుతుందో తెలుసా?
బరువు తగ్గడానికి, ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించుకోవడానికి రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు. కొందరు ఉపవాసం చేస్తుంటే, మరి కొందరు కీటో డైట్ పాటిస్తున్నారు. ఇంకొందరు డీఎన్ఏ డైట్ లేదా డిటాక్స్ డ్రింక్స్ ఎంచుకుంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో 'ప్రతిరోజూ 1 కిలోమీటరు నడవడం' అనే కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. రోజుకు కేవలం 1 కిలోమీటరు నడవడం ద్వారా బరువు తగ్గడం సాధ్యమేనా? ఒక నెలలో ఫలితాలు ఎలా ఉండవచ్చు? అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

నడక (వాకింగ్) అనేది ఏ వయసు వారైనా సునాయాసంగా చేయగలిగే ఒక వ్యాయామం. నడక శరీరాన్నే కాకుండా మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. మీకంటూ సమయం కేటాయించుకునే అవకాశాన్ని ఇస్తుంది. శరీరాన్ని సహజంగా చురుకుగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది. పోషకాహార నిపుణురాలు డాక్టర్ గీతికా చోప్రా ఏం చెబుతున్నారంటే.. ప్రతిరోజూ 1 కిలోమీటరు నడవడం వల్ల ఎంత బరువు తగ్గుతారనే దానికి నిర్దిష్టమైన సంఖ్య ఏదీ లేదు. ఇది పూర్తిగా మీ శరీరాకృతి, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. 1 కిలోమీటరు నడవడం ఒక అలవాటుకు మంచి ప్రారంభం కావచ్చు. కానీ కొవ్వును గణనీయంగా తగ్గించడానికి ఇది సరిపోదు.
మీరు మీ ఆహారపు అలవాట్లను మార్చుకోకుండా ప్రతిరోజూ 1 కిలోమీటరు నడిస్తే నెలలో మీ శరీరం సుమారు 1200 నుంచి 2000 కేలరీలను ఖర్చు చేస్తుంది. వైద్యపరంగా చెప్పాలంటే దీనివల్ల నెలలో కేవలం 0.15 నుండి 0.25 కిలోగ్రాముల కొవ్వు మాత్రమే తగ్గుతుంది. అంటే అద్దంలో మీ రూపం చూసుకుంటే మీకు ఎలాంటి స్పష్టమైన మార్పు కనిపించదు. కానీ దీనిలోని సానుకూల అంశం ఏమిటంటే మీ శరీరం చురుకుగా ఉంటుంది.
మరి బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
1 కిలోమీటరు నడవడం ప్రభావవంతంగా ఉంటుందా లేదా అనేది ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవేంటంటే..
- శరీర బరువు.. అధిక బరువు ఉన్నవారు ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తారు.
- BMR: మీ జీవక్రియ నెమ్మదిగా ఉంటే, కొవ్వు తగ్గడం కూడా నెమ్మదిగా ఉంటుంది.
- నడక వేగం: సాధారణంగా నడవడం కంటే వేగంగా నడవడం లేదా ‘చురుకుగా నడవడం’ (గంటకు 5-6 కి.మీ.) మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
- ఆహారం: నడక తర్వాత అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటే, నడక వల్ల కలిగే ప్రయోజనాలు కోల్పోతారు.
- అలాగేతగినంత నిద్ర, ఒత్తిడి-హార్మోన్ల అసమతుల్యత (థైరాయిడ్ లేదా PCOS వంటివి) బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ 1 కిలోమీటరు నడవడం ఒక గొప్ప ‘ప్రారంభ అలవాటు’. కానీ త్వరగా బరువు తగ్గడమే మీ లక్ష్యం అయితే నియంత్రిత ఆహారంతో పాటు, మీరు నడిచే దూరం, వేగంపై కూడా శ్రద్ధ పెట్టడం ముఖ్యం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




