
మన శరీరంలో అత్యంత కీలకమైన, సున్నితమైన అవయవం మెదడు. ఇది మనం నిద్రపోతున్నప్పుడు కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటుంది. అయితే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు మెదడు పనితీరును దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలకు కారణమయ్యే ఆ 5 ప్రమాదకరమైన అలవాట్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది నిద్రను త్యాగం చేస్తున్నారు. కానీ నిద్ర లేకపోవడం వల్ల మెదడు కణాలకు తీరని నష్టం జరుగుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు రోజంతా సేకరించిన సమాచారాన్ని భద్రపరుస్తుంది. వ్యర్థాలను శుభ్రం చేస్తుంది. నిద్ర తగ్గితే మెదడు మొద్దుబారిపోయి అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
చిన్నపాటి ఒత్తిడి పనులను త్వరగా పూర్తి చేయడానికి సహాయపడవచ్చు.. కానీ నిరంతర ఒత్తిడి మెదడుకు విషం లాంటిది. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మెదడులో జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోకాంపస్ అనే భాగాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల విషయాలను త్వరగా మర్చిపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం వంటివి జరుగుతాయి.
వ్యాయామం కేవలం కండరాల కోసమే కాదు మెదడు చురుగ్గా ఉండటానికి కూడా అవసరం. మనం వ్యాయామం చేసినప్పుడు మెదడుకు రక్త ప్రసరణ పెరిగి, తగినంత ఆక్సిజన్ అందుతుంది. ఇది కొత్త మెదడు కణాలు పుట్టడానికి సహాయపడుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.
మనం తినే ఆహారం మెదడు ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న స్వీట్లు, సోడాలు మెదడులో వాపును కలిగిస్తాయి. ఇవి మెదడులోని న్యూరాన్ల మధ్య సమాచార మార్పిడిని అడ్డుకుంటాయి. తెలివితేటలు పెరగాలంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే వాల్‌నట్స్, చేపలు, ఆకుకూరలు తీసుకోవడం ఉత్తమం.
గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియాలో గడపడం వల్ల మెదడుపై తీవ్రమైన భారం పడుతుంది. ముఖ్యంగా రాత్రివేళ మొబైల్ నుంచి వచ్చే నీలి కాంతి మెదడును నిద్రపోనివ్వదు. ఇది ఏకాగ్రతను దెబ్బతీయడమే కాకుండా, మెదడును ఎప్పుడూ అలసిపోయినట్లు చేస్తుంది. మెదడు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సరైన నిద్ర, పౌష్టికాహారం, ఒత్తిడి లేని జీవనం అలవాటు చేసుకుంటే వృద్ధాప్యంలో కూడా మీ మెదడు 20 ఏళ్ల యువకుడిలా చురుగ్గా పనిచేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..