బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా? అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునే వారికి నల్ల ఎండుద్రాక్ష ఒక అద్భుతమైన ఆహార పదార్థం. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన నల్ల ఎండుద్రాక్షలను తినడం వల్ల రోజంతా శక్తి అందుతుంది. అయితే, బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎండుద్రాక్షలను ఎలా తీసుకువాలి..? సరైన పద్ధతి ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

బరువు తగ్గాలని ప్రయత్నించే చాలామంది ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజూ మన వంటింట్లో లభించే కొన్ని సాధారణ పదార్థాలు బరువు నియంత్రణలో అద్భుతంగా సహాయపడతాయి. అందులో నల్ల ఎండుద్రాక్ష ముందుంటుంది. నల్ల ఎండుద్రాక్షను తినడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాకుండా, శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
నల్ల ఎండుద్రాక్ష బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?
నల్ల ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసి, కేలరీలను వేగంగా కరిగించడానికి సహాయపడతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఉదయాన్నే వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల పదే పదే ఆహారం తినాలనే కోరిక, స్వీట్స్ తినాలనే కోరిక క్రమంగా తగ్గుతాయి. బరువు తగ్గే ప్రయత్నంలో కొన్నిసార్లు శరీరం నీరసంగా మారుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
నల్ల ఎండుద్రాక్ష తినవలసిన సాంప్రదాయ, సరైన విధానం:
ఎండుద్రాక్షను నేరుగా తినడం కంటే, వాటిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గుప్పెడు నల్ల ఎండుద్రాక్షలను ఒక గ్లాసు నీటిలో శుభ్రంగా కడిగి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపున నానిన ఎండుద్రాక్షలను తినాలి. అలాగే ఆ నీటిని కూడా వృథా చేయకుండా త్రాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి మరియు జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
అదనపు ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు తగ్గడంతో పాటు, నల్ల ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, రక్తహీనత నివారించబడుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే, ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.




