ఆరోగ్యమే మహా భాగ్యం ఇది మనకు చిన్నప్పటి నుంచి పెద్దలు నేర్పుతున్నదే. ఇది నిజం కూడా. అందుకే మనం తినే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి తినే ఆహారం సమతుల్యంగా ఉండేలా ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్ వంటి అనేక పోషకాలను చేర్చుకుంటాము. ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు, చిరు ధాన్యాలు, పాల ఉత్పత్తులలో మనకు ఈ పోషకాలు లభిస్తాయి. అయితే పండ్లు, కూరగాయలతో పాటు.. కొన్ని రకాల విత్తనాలు కూడా ఆహారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ విత్తనాలను అనేక విధాలుగా తినే ఆహారంలో చేర్చుకోవచ్చు. అంతేకాదు ఈ విత్తనాల సహాయంతో అనేక ఆరోగ్యకరమైన వంటకాలను కూడా చేయవచ్చు.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. నేడు సూపర్‌ఫుడ్‌ల వలె పనిచేసే అనేక విత్తనాలు ఉన్నాయి. వీటిల్లో శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఆరోగ్యంగా ఉండడానికి శరీరానికి అనేక పోషకాలను అందించే బెస్ట్ సీడ్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.. వీటిని తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే.. ఆరోగ్యం కూడా ఉంటారు.
పొద్దుతిరుగుడు విత్తనాలు: పొద్దుతిరుగుడు విత్తనాలు లేదా పొద్దుతిరుగుడు గింజలను ఇతర డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ గింజల్లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. అంతేకాదు అదనంగా ఇందులో చాలా ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫైబర్ ఉన్నాయి. దీని కారణంగా గుండె ఆరోగ్యం ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలను ఆరోగ్యంగా ఉంచడంలో పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి.
నువ్వులు: నలుపు లేదా తెలుపు నువ్వులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఈ చిన్న గింజలు ఎన్నో రకాల పోషకాల భాండాగారం. ఇవి రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహకరిస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని ఎముకలు ధృడంగా తయారవుతాయి.
గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వీటిల్లో అమైనో ఆమ్లాలు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు, జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరం బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు రోజూ గుమ్మడి గింజలను తింటే బరువు అదుపులో ఉంటుంది.
అవిసె గింజలు: అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉత్తమమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా వీటిలో ఉంటాయి. అందుకని అవిసె గింజలను పొడిని తయారు చేసుకుని లేదా సలాడ్ రూపంలో తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మలబద్ధకం లేదా ఏదైనా కడుపు సంబంధిత సమస్య ఉంటే.. తప్పనిసరిగా తినే ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)