Vidura Niti: ఈ అలవాట్లు ఉంటే మీ ఇంటిలో ధనం నిలవదు..!
మహాభారతంలో అనేక మంది బలశాలి యోధులు ఉన్నారు. కానీ అందులో ఓ ప్రత్యేకమైన వ్యక్తి నైపుణ్యంతో, తెలివితేటలతో, న్యాయశాస్త్ర పరిజ్ఞానంతో ప్రసిద్ధి చెందారు. ఆయన ఎవరో కాదు మహాత్మా విదురుడు. ఆయన ధర్మపరమైన అంశాలను సమర్థంగా చెప్పగలిగిన గొప్ప మంత్రిగా హస్తినాపురంలో పేరుపొందారు. విదురుడు చెప్పిన ఉపదేశాలను విదుర నీతి గ్రంథంలో పొందుపరిచారు.

విదుర నీతిలో రాజధృతరాష్ట్రునికి విదురుడు ఇచ్చిన అమూల్యమైన ఉపదేశాలు ఉన్నాయి. ఈ నీతులు మనుష్యుని జీవితాన్ని సద్గుణపరచడానికి సహాయపడతాయి. ఇవి మహాభారత కాలంలో ఎంత ముఖ్యమైనవో, ఇప్పటికీ అంతే ప్రాముఖ్యమైనవి. మనం ధనం సంపాదించాలనుకుంటే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని మంచిపనులను అలవర్చుకోవాలి. కొన్ని చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయాలి.
విదుర నీతి ప్రకారం మద్యం, ధూమపానం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడే వ్యక్తులపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండదు. వీరు సంపాదించిన సంపదను వ్యసనాలకు ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందం కోసం డబ్బును పాడు చేస్తారు. అందువల్ల వీరు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు.
ఇంద్రియాలపై నియంత్రణ లేకపోతే.. మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే అలాంటి వ్యక్తులపై లక్ష్మీ కృప ఉండదు. ధర్మాన్ని పాటించని నాస్తికుల ఇళ్లలో కూడా లక్ష్మీ నిలవదు. విదురుని ప్రకారం నైతిక విలువలు పాటించే వారికే ధనం నిలుస్తుంది.
కష్టపడి పనిచేయని ఎప్పుడూ నిదానంగా, నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తుల ఇళ్లలో ధనం స్థిరంగా నిలవదు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేని వారు జీవితంలో వెనుకబడిపోతారు. ఎవరైతే శ్రమించకుండా విజయాన్ని ఆశిస్తారో వారు కష్టాలలో పడిపోతారు. అందుకే ధనం నిలవాలంటే శ్రమించడం తప్పనిసరి.
ఎవరైతే ఎప్పుడూ బాధలో ఉంటారో ధనం, సంపద, ఆనందం వారి జీవితంలో ఎక్కువ రోజులు నిలవవు. ఎప్పుడూ బాధపడే వ్యక్తులు ఏ పని చేయడానికి ఆసక్తి చూపరు. పనిలో సరిగా దృష్టి పెట్టరు. దీంతో వారికున్న అవకాశాలను కోల్పోయి ఆర్థికంగా నష్టపోతారు.
విదుర నీతి ప్రకారం ధనం సమకూరేందుకు మనం సంపదను నిలుపుకునేందుకు మంచి అలవాట్లు అవసరం. మద్యపానం, అలసత్వం, నిరాశ వంటి చెడు అలవాట్లను విడనాడాలి. ధర్మపరంగా నడుచుకుంటే లక్ష్మీ దేవి కృప లభించి, సంపద పెరుగుతుంది.
విదుర నీతి చెప్పిన ఈ మాటలు జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ధనం నిలవాలంటే న్యాయబద్ధంగా కష్టపడి సంపాదించాలి. చెడు అలవాట్లు విడిచిపెట్టాలి. సద్గుణాలతో జీవనం సాగించేవారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.