వ్యవసాయాన్ని ఇప్పుడు కొందరు లాభాల బాట పట్టిస్తూ ఆదాయాన్ని ఇచ్చే వ్యాపారంగా మార్చుకున్నారు. సరి కొత్తఆలోచనలతో, ఆధునిక సాంకేతికతల వ్యవసాయం చేస్తూ.. పండ్లు, కూరగాయలు, ధాన్యం ఇలా వేటినైనా ఉత్పత్తిలో మునిపైకంటే అభివృద్ధి సాధించారు. దీంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగింది. చదువుకున్న యువత కూడా నెలకు లక్షల రూపాయలను ఇచ్చే ఉద్యోగాలు వదిలి వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం. ఈ నేపథ్యంలో తాను చేస్తున్న ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తూ కోటీశ్వరురాలిగా మారిన యువతి సక్సెస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తాను వ్యవసాయం చేస్తూనే ఇతర రైతులకు కూడా వ్యవసాయం చేయడంలో మెళకువులను నేర్పుతుంది.
ఈ యువతి పేరు స్మ్రిక చంద్రకర్ (Smrika Chandrakar). ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లా కురుద్ బ్లాక్‌లోని చార్ముడియా గ్రామ నివాసి. పూణేలో ఎంబీఏ చదివింది. అంతేకాకుండా కంప్యూటర్ సైన్స్‌లో బీఈ కూడా చేసింది. 15 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీతో ఎమ్మెన్సీ కంపెనీలో పనిచేసేది. అలా ఉద్యోగం చేస్తున్న సమయంలో స్మ్రిక చంద్రకర్ తండ్రి ఆరోగ్యం క్షీణించింది. ఇదే స్మ్రిక చంద్రకర్ కెరీర్ కు ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
స్మ్రిక చంద్రకర్ తండ్రి ఆ గ్రామంలో భూ స్వామి. గ్రామంలో చాలా భూమి ఉంది. 2020లో 23 ఎకరాల్లో కూరగాయల సాగు ఆయన మొదలు పెట్టాడు. అయితే తండ్రి అనారోగ్యంతో పొలానికి వెళ్లలేకపోతున్నాడని స్మ్రిక గుర్తించింది. దీంతో తానే హలం పట్టి పొలం బాట పట్టింది. తన ఉద్యోగం వదిలి గ్రామానికి వచ్చి తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత అనతికాలంలోనే ఆ యువతి వ్యవసాయం చేయడంలో మెళుకులను నేర్చుకుంది. తన భూమిలో శాస్త్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ప్రారంభించింది. నేల నాణ్యతను బట్టి పంటను ఎంచుకుంది. దీని కారణంగా విపరీతమైన ఉత్పత్తి ప్రారంభమైంది.
ఆ తర్వాత కొంత డబ్బు వెచ్చించి తన పొలాన్ని ఆధునిక వ్యవసాయ క్షేత్రంగా మార్చింది. స్మ్రిక చంద్రాకర్‌కు చెందిన “ధార కృషి ఫామ్”లో ఇప్పుడు రోజుకు 12 టన్నుల టమోటాలు, 8 టన్నుల బెండకాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు స్మ్రిక వ్యవసాయతో వార్షిక టర్నోవర్ రూ. 1 కోటి కంటే ఎక్కువ. విశేషమేమిటంటే స్మ్రిక వ్యవసాయం ద్వారా తాను సంపాదించుకోవడమే కాదు తన పొలంలో 150 మందికి ఉపాధి కల్పిస్తోంది. స్మ్రిక పొలంలో పండే వంకాయలు, టమోటాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు కూడా సరఫరా చేయబడతాయి.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..