AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ 3 ఫుడ్స్ తింటే ఏమవుతుందో తెలుసా..?

మీరు ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతున్నారా..? అయితే డేంజర్..! ఆమ్లత్వం పెంచి, రోజంతా మిమ్మల్ని డల్ చేసే ఆ సిట్రస్ పండ్లు,, వేయించిన ఫుడ్స్ ఏమిటో తెలుసా? వాటికి బదులు ఇడ్లీ, ఓట్స్, గోరువెచ్చని నీళ్లు ఎందుకు బెస్టో తెలుసుకోవాలంటే.. కథనం పూర్తిగా చదవాల్సిందే..

Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ 3 ఫుడ్స్ తింటే ఏమవుతుందో తెలుసా..?
3 Foods You Never Eat On An Empty Stomach
Krishna S
|

Updated on: Oct 11, 2025 | 8:10 PM

Share

చాలా మందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగడం లేదా అల్పాహారం తీసుకోవడం అలవాటు. అయితే ఖాళీ కడుపుతో మనం తీసుకునే ఆహారం లేదా పానీయం మన జీర్ణవ్యవస్థపై, రోజంతా మన శక్తి స్థాయిలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనవే అయినా వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీ పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే, ఉదయాన్నే తినకూడని ఆ 3 ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుల్లని పండ్లు

నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ వాటిని ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో ఆమ్లత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు లోపలి పొరను చికాకు పెడుతుంది. కడుపులో మంట, గుండెల్లో మంట, వికారం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే కడుపు సమస్యలు ఉన్నవారు వీటిని పూర్తిగా మానుకోవాలి.

బ్లాక్ కాఫీ

చాలామంది ఉదయం లేవగానే ఎనర్జీ కోసం బ్లాక్ కాఫీని తాగుతారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వస్తాయి. కాఫీలో ఉండే కెఫిన్, ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను పెంచుతుంది. ఇది మీ శరీరం యొక్క సహజ శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఫలితంగా రోజంతా బద్ధకంగా, శక్తి కోల్పోయినట్లు అనిపిస్తుంది.

నూనెలో వేయించిన ఆహారాలు

ఉదయం పూట నూనె ఎక్కువగా ఉన్న, వేయించిన లేదా మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అనవసరమైన భారం పడుతుంది. వేయించిన ఆహారాల్లోని ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక మసాలాలు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం పెంచుతాయి. ఉదయాన్నే ఇలాంటి భారీ ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా బద్ధకం, అలసట వస్తాయి.

మీ రోజును ఇలా ప్రారంభించండి..!

మీరు రోజంతా ఉత్సాహంగా, శక్తితో ఉండాలంటే ఉదయం తేలికపాటి మరియు పోషకమైన ఆహారంతో రోజును ప్రారంభించాలి.

ఉత్తమ అల్పాహారం: బ్రౌన్ బ్రెడ్, ఆమ్లెట్, ఇడ్లీ-సాంబార్, దోస, పోహా, ఉడికించిన గుడ్డు, అరటిపండు లేదా యాపిల్ లాంటివి తినడం మంచిది. నానబెట్టిన జీడిపప్పు, ఓట్స్ లేదా అరటిపండ్లు పేగు ఆరోగ్యానికి చాలా మంచివి.

ఉదయం డ్రింక్: నిమ్మకాయ నీళ్లకు బదులు, గోరువెచ్చని లేదా సాధారణ నీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా సహాయపడతాయి!

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..