సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో… కశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. భద్రతా దళాలు స్పందించి కాల్పులు జరపడంతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాకీర్ మూసా హతమయ్యాడు.
దక్షిణ కశ్మీర్ లో మూసా నక్కి ఉన్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ట్రాల్ ప్రాంతంలోని దాద్సర్ లోని ఓ ఇంట్లో దాక్కుండటంతో.. భద్రతా దళాలు ఇంటిని చుట్టుముట్టి.. అతన్ని లొంగిపోవాల్సిందిగా కోరారు. అయినా కూడా వినకుండా కాల్పులకు దిగడంతో.. భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో జాకీర్ ముసా హతమయ్యాడు. ఘటనాస్థలిలో భారీగా రాకెట్ లాంచర్లు, ఏకే -47 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మూసా .. గతంతో హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాద సంస్థలో పనిచేశాడు. 2013లో పంజాబ్‌లో ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదంపై ఆకర్షితుడై హిజ్బుల్‌లో చేరాడు. బుర్షాన్ వనీ కన్నా ముందు హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలో కమాండర్‌గా పనిచేశాడు. తర్వాత తన సొంత సంస్థ అన్సర్ ఘాజ్ వాత్ ఉల్ హింద్ ను స్థాపించారు. ఇది ఆల్ ఖైదాకు గుర్తింపుపొందిన సంస్థ. అలాగే కశ్మీర్ అంశంపై రాజకీయ చర్యలు జరుపుతామన్న హురియత్ నేతలను కశ్మీర్ లాల్ చౌక్ లో ఉరితీస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మూసా హతమవ్వడంతో కశ్మీర్ లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో దక్షిణ కశ్మిర్ మొత్తం సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది.