ఖాకీ నో అంది.. కాని, ఖద్దర్ సై అంది, తూర్పు గోదావరి జిల్లాలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో జోరుగా కోడి పందేలు
ఖాకీ నో అంది.. కానీ ఖద్దర్ సై అంది. ఇంకేముంది... కోళ్లు కత్తులు దూశాయి.. ఫలితం, కోడి చచ్చింది.. ఖాకీ ఓడింది.. రాజకీయనాయకులు గెలిచారు...

ఖాకీ నో అంది.. కానీ ఖద్దర్ సై అంది. ఇంకేముంది… కోళ్లు కత్తులు దూశాయి.. ఫలితం, కోడి చచ్చింది.. ఖాకీ ఓడింది.. రాజకీయనాయకులు గెలిచారు. కోనసీమలో ప్రస్తుత పరిస్థితి ఇది. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు తూర్పు గోదావరి జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి. కోడి పందేలకు పర్మిషన్ లేదన్న పోలీస్ వార్నింగ్‌లను నిర్వాహకులు పట్టించుకోలేదు. దర్జాగా బరులు సిద్ధం చేసి… టెంట్లు వేసి మరీ నోట్ల కట్టల్ని చేతుల్లో పట్టుకొని పందాలకు దిగుతున్నారు. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుండటం విశేషం. కోనసీమ వ్యాప్తంగా మొత్తం 250 చోట్ల పందేలు జరుగుతున్నాయి. అమలాపురం రూరల్ మండలంలోని ఉప్పలగుప్తం, అల్లవరం, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలలో ఇప్పటికే కోడి పందేలు ప్రారంభమయ్యాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వయంగా కోడి పందేలను ప్రారంభించారు. పందెం రాయుళ్లను ఉత్సాహపరిచారు. చాలా చోట్ల ప్రజా ప్రతినిధులే బరులను దగ్గరుండి ప్రారంభించారు. దీంతో అధికారులు చేసేది ఏమి లేక ప్రేక్షక పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.