ఈ నెల 8 నుంచి ఆలయాలు, మాల్స్, హోటళ్లు ఓపెన్..
తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రదేశాల్లో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలను, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను ఈ నెల 8వ తేదీ నుంచి తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రదేశాల్లో ఉన్న అన్ని ప్రార్థనా మందిరాలను, హోటళ్ళు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లను ఈ నెల 8వ తేదీ నుంచి తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని.. వాటి వెలువల ఉన్న ఆలయాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్ తెరుచుకోవచ్చునని అందులో పేర్కొంది. రాత్రి కర్ఫ్యూ సమయంలో వీటిల్లో ఎవరిని అనుమతించబోమని తెలిపింది.
ప్రజలందరూ కూడా మాస్క్ ధరించాలని.. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఆలయాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, మాల్స్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని.. ప్రతీ చోటా హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఇక యధావిధిగా నైట్ 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగానుండగా.. ఆసుపత్రులు, ఫార్మసీలు మినహా అన్ని షాపులు రాత్రి 8.30 తర్వాత మూసి ఉండాలని స్పష్టం చేసింది. 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచించింది. కాగా, లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, ప్రార్ధనా మందిరాలు మూతపడిన సంగతి తెలిసిందే.
ఇది చదవండి: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్, బెంగళూరుకు బస్సులు.. కానీ!




