విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మెన్ విజయశాంతి మరోసారి నర్మగర్భ వ్యాఖ్యలతో రాజకీయ చర్చకు తెరలేపారు. గులాబీ పార్టీని విమర్శిస్తూనే బీజేపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Nov 08, 2020 | 4:11 PM

Vijayashanthi sensational political comments:  సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మెన్ విజయశాంతి మరోసారి నర్మగర్భ వ్యాఖ్యలతో రాజకీయ చర్చకు తెరలేపారు. గులాబీ పార్టీని విమర్శిస్తూనే బీజేపీ సానుకూల వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోలేదేమో అన్నట్లుగా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీగా మాణిక్కం ఠాగూర్ కాస్త ముందుగా బాధ్యతలు చేపడితే బావుండేదేమో అనడం.. ఇప్పుడొచ్చి చేసేదేమీ లేదు అన్న సంకేతాల్నిస్తున్నాయి. ఈ క్రమంలో విజయశాంతి కామెంట్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

కొన్ని రోజుల క్రితం విజయశాంతి తిరిగి బీజేపీలో చేరబోతోందన్న కథనాలు వినిపించాయి. దానికి తోడు ఆమెతో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డి సమాలోచనలు జరపడం ఆ కథనాలకు అవకాశమిచ్చింది. అయితే.. వెంటనే తేరుకున్న కాంగ్రెస్ నేతలు ఆమె పార్టీ వీడకుండా రాయబారాలు నెరిపారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ కూడా స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆమెతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే వుండాలని కోరారు. దాంతో ఆమె పార్టీ తరపున ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి.. పార్టీ మారడం లేదన్న సంకేతాల్నిచ్చారు.

అయితే, తాజాగా ఆదివారం విజయశాంతి చేసిన కామెంట్లు మరోసారి ఆమె రూటు బీజేపీ వైపే అన్న సంకేతాల్నిస్తున్నాయి. ‘‘ టీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌ పార్టీని బలహీన పర్చడం వల్లే బీజేపీ.. టీఆర్‌ఎస్‌కు సవాల్‌ విసిరే స్థాయికి చేరింది.. తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్‌ కొంత ముందుగా రాష్ట్రానికి వచ్చి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగయ్యేది.. ఇక కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తును కాలము, ప్రజలే నిర్ణయిస్తారు..’’ అని విజయశాంతి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

‘‘ ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్‌కు సరిగ్గా వర్తించే సమయం సమీపించింది.. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి… ఇంకొందరిని భయపెట్టి… ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారు.. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చింది.. మరికొంత ముందుగానే మాణిక్కం ఠాగోర్ రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలి..’’ అని విజయశాంతి అన్నారు.

విజయశాంతి వ్యాఖ్యాలు తాజాగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీనే తెలంగాణలో బలంగా వుందని ఆమె వ్యాఖ్యలు ధ్వనిస్తున్నాయి. బీజేపీ బలంగా వున్నందున ఆమె ఆ పార్టీలో చేరేందుకే మొగ్గు చూపవచ్చన్న విశ్లేషణలు మళ్ళీ మొదలయ్యాయి. ఒక పార్టీలో వుంటూ మరో పార్టీ బలంగా వుందని వ్యాఖ్యానించడం నిజానికి క్రమశిక్షణ ఉల్లంఘన పరిధిలోకి వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ తనపై చర్యలకు ఉపక్రమిస్తే తన నిష్క్రమణకు మార్గం సుగమం చేసిన వాళ్ళవుతారని విజయశాంతి భావిస్తుందేమో అని అనుకుంటున్నారు. ఏదిఏమైనా విజయశాంతి కమలం గూటికి చేరడం ఖాయమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ALSO READ: పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు

ALSO READ: కేదార్‌నాథ్ చేరిన సంతోష్ సంకల్పం

ALSO READ: రెచ్చిపోయిన బైక్ రైడర్.. ఒకరి మృతి