మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు జల్లు కురిపించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ చిత్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఎంతో బాగుందని, తెలుగులో ఎంతో మంచి సినిమా తీశారని ఆయన అభినందించారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుని జీవితాన్ని తెలుసుకుంటే ప్రజల్లో మరింత దేశభక్తి పెరుగుతుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ చిత్రాన్ని తీయడం ఎంతో గొప్ప నిర్ణయమని నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డిలను అభినందించారు. నరసింహారెడ్డి పాత్ర చేసిన చిరంజీవిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి చిత్రాలు మరిన్ని రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమయం తీసుకుని సైరాను చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. అదే విధంగా ఈ చిత్రం చూడాల్సిందిగా ప్రధాని మోదీని కూడా కోరతానని, ఆయన అప్పాయింట్ మెంట్ కూడా తీసుకున్నట్టు చిరంజీవి తెలిపారు.