ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : తెలంగాణ ఆర్టీసీలో నష్టాలకు కారణమెవరు?

రోడ్డుపై ప్రగతి రథ చక్రానికి బ్రేక పడటంతో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ కావు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో సహా మొత్తం 26 డిమాండ్లతో ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆర్టీసీని కాపాడుకోవాలనే లక్ష్యంతో అటు సిబ్బంది, ఇటు ప్రభుత్వం రెండూ కలిసి ఒకే దారిన కాకుండా చెరో దారిన పయనించడంతోనే అసలు సమస్య వచ్చిపడింది. కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని ప్రభుత్వం బెట్టు చేస్తోంది. పైగా సమ్మెకు దిగిన వారు తమ ఉద్యోగులు కానే […]

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ :  తెలంగాణ ఆర్టీసీలో  నష్టాలకు కారణమెవరు?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 10, 2019 | 10:15 PM

రోడ్డుపై ప్రగతి రథ చక్రానికి బ్రేక పడటంతో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ కావు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో సహా మొత్తం 26 డిమాండ్లతో ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. ఆర్టీసీని కాపాడుకోవాలనే లక్ష్యంతో అటు సిబ్బంది, ఇటు ప్రభుత్వం రెండూ కలిసి ఒకే దారిన కాకుండా చెరో దారిన పయనించడంతోనే అసలు సమస్య వచ్చిపడింది. కార్మికుల డిమాండ్లు పరిష్కరించలేమని ప్రభుత్వం బెట్టు చేస్తోంది. పైగా సమ్మెకు దిగిన వారు తమ ఉద్యోగులు కానే కాదంటూ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతానికి తాత్కాలిక సిబ్బందితో నెట్టుకు వస్తున్నా సరైన ప్రజా రవాణా సాధనాలు లేక ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నారు.

దసరా పండుగను తమకు డిమాండ్ల సాధనకు ఉపయోగించుకోవాలని సమ్మెకు దిగారు ఆర్టీసీ ఉద్యోగులు. అయితే సమ్మె న్యాయబద్దం కాదంటున్న ప్రభుత్వం ఈనెల 5 వ తేదీ సాయంత్రం వరకు ఉద్యోగులు తమ విధులకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించిన 12 వందల మంది కార్మికులు విధులకు హాజరుకాగా మిగిలిన 48 వేలమంది సమ్మె చేయడానికే నిర్ణయించుకుని.. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లకు నో అని చెప్పిన ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేయడానికి మూడు రకాల వ్యూహాలను వెల్లడించింది. వీటిలో 50 శాతం సొంత బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేటు బస్సులు నడపాలని నిర్ణయించి తర్జన భర్జన పడుతోంది. మరోవైపు ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌లో భాగంగా డ్రైవర్‌కు రూ. 1,500, కండక్టర్‌కు రూ.1,000 ఇవ్వడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలతో కలిపి సమావేశమైంది. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెకు వీరంతా మద్దతు ప్రకటించారు. శుక్రవారం తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ డిపోలవద్ద మౌన ప్రదర్శన చేపడతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథ్థామ‌రెడ్డి ప్రకటించారు. అక్టోబర్ 21 న జరగనున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలపై ఆర్టీసీ సమ్మె తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌తో రాజకీయంగా అడుగులు వేయాలనుకున్న సీపీఐ..సమ్మె విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. అవసరమైతే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి ఇచ్చిన మద్దతుపై పునారలోచిస్తామని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం.. ప్రభుత్వంపై అసంతృప్తి

ఇప్పటికే ఆర్టీసీ చేస్తున్న సమ్మెపై హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్రసింగ్ ఈనెల 6న దీన్ని దాఖలు చేశారు.  అయితే సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని తమ ఉద్దేశం కాదని, సమ్మెకు దిగుతున్నట్టుగా నెలరోజుల మందే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చినట్టు ఆర్టీసీ జేఏసీ న్యాయస్ధానానికి తెలిపింది. దీనిపై ప్రభుత్వం .. కార్మికుల డిమాండ్లు పరిష్కరించేలోగానే వారు సమ్మెకు దిగారని వాదించింది. పైగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కూడా చెప్పింది. ఈ వాదనల్లో ప్రభుత్వ వాదనపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరో అఫిడవిడ్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిచ్చింది.

తెలంగాణ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి

టీఎస్ఆర్టీసీకి టికెట్ల అమ్మకాల ద్వారా రోజుకు రూ. 11.38 కోట్ల ఆదాయం వస్తుంది. 2018-19 సం.రానికి టికెట్ల ద్వారా రూ. 3,976 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక షాపుల అద్దెలు, ప్రకటనలు, పార్శిల్స్ ద్వారా రూ.1000 కోట్లు వచ్చింది. ఈ ప్రకారం వచ్చిన ఆదాయం రూ.4,882 కోట్లు. అయితే ఆదాయం కంటే ఖర్చులే అధికంగా కనిపిస్తున్నాయి. అదనంగా రూ.1000 కోట్ల రూపాయల ఖర్చు తేలింది. దీని ఫలితంగా 2018-19లో ఆర్టీసికి వచ్చిన నష్టం రూ.928 కోట్లు . ఇక 2019 మే నెలలో ఆర్టీసీకి కిలోమీటర్‌కు ఖర్చు రూ.42.89 కాగా, వచ్చిన ఆదాయం కిలో మీటర్‌కు రూ. 30.35పైసలుగా తేలింది.

ఆర్టీసీ బకాయిలు అసలు ఎంత?

2014 15 ఆర్ధిక సంవత్సరంలో రావాల్సిన బకాయిలు రూ. 118 కోట్లు కాగా, వస్తున్నవి రూ.528 కోట్లు. 2015 16లో రావాల్సినవి రూ.102 కోట్లు, రావాల్సినవి రూ.535 కోట్లు. 2016- 17లో రూ.27 కోట్లు – 553 కోట్లు, 2017 -18 లో రూ. 260 కోట్లు రూ. 560 కోట్లు ,2018- 19లో రూ.130 కోట్లు, రూ. 644 కోట్లుగా లెక్కలు తేల్చారు.

2019-20 రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసికి కేటాయించిన నిధులు

అప్పుల పాలైన ఆర్టీసిని ఆదుకోడానికి ఇచ్చిన అప్పు రూ.70 కోట్లు, అలాగే కొత్త బస్సులు కొనడానికి చేసిన అప్పు రూ.140 కోట్లు. కాగా మొత్తం రూ. 850 కోట్ల ఆర్టీసీ అప్పులకు ప్రభుత్వం పూచీకత్తుగా ఉంది.

ఆర్టీసీ జేఏసీ వాదన ఏంటీ?

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోడానికి, సంస్ధను ప్రభుత్వంలో విలీనం చేయడానికి 2013 అక్టోబర్‌లోనే జీవో విడుదలైందని, దీనిపై అప్పటి ప్రభుత్వం హర్యానా, పంజాబ్ వెళ్లి అధ్యయనం చేసి నివేదికను సమర్పించారని ఆర్టీసీ జేఏసీ చెబుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం చేసి సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఏపీలో ఇటీవల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదంటూ ప్రశ్నిస్తోంది జేఏసీ. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణమని, రూ.50 వేల కోట్ల ఆస్తులను దెబ్బకొట్టాలని చూస్తే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని జేఏసీ హెచ్చిరిస్తోంది.

టీఎస్ఆర్టీలో ఉన్న బస్సులు సంగతేంటీ?

రాష్ట్రంలో తిరుగుతున్న మొత్తం బస్సుల సంఖ్య 10,460, వీటిలో ఆర్టీసీ సొంతబస్సులు 8,320, అద్దెకు తీసుకున్న బస్సుల సంఖ్య 2,140 గా ఉంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్న రూట్ల సంఖ్య 3,653 కాగా బస్సులు రూట్లలో కవర్ చేసే గ్రామాల సంఖ్య 9,377. ఆర్టీసీ బస్సుల ప్రతిరోజు 35.29 లక్షల కి.మీ. తిరుగుతూ దాదాపు కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్ధానాలకు సురక్షితంగా చేర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. నిర్దిష్టమై సమాయానికి బస్సులను నడుపుతున్న ఆర్టీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య అన్ని డిపార్ట్‌మెంట్లలో కలిపి మొత్తం 50,317 మంది. వీరికి 2015లో తెలంగాణ ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ కూడా ఇచ్చి ప్రోత్సహించింది.

సంస్ధను కుదిపేస్తున్న సమ్మెలు

ఈ ఏడాది ఆగస్టు 27న సమ్మెకు టీజేఎన్‌యూ సమ్మె తొలి నోటీసు ఇచ్చింది. ఆ వెంటనే సెప్టెంబర్ 3న ఆర్టీసీ జేఏసీ మరో నోటీసు జారీ చేసింది. అయితే ఆర్టీసీ జేఏసీ, యూనియన్లు సమ్మె నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించని ప్రభుత్వంపై వైఖరిని నిరసిస్తూ అక్టోబర్ 5న ఏకంగా సమ్మెకు దిగారు కార్మికులు. అయితే ఆర్టీసీ చేపట్టిన సమ్మెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం అక్టోబర్ 6 సాయంత్రానికల్లా విధుల్లో చేరాలని ఆదేశించింది. ఇక సీఎం కేసీఆర్ స్వయంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ఉన్నతాధికారులతో సమీక్షించి విలీనం డిమాండ్‌ను త్రోసిపుచ్చారు. వెంటనే కొత్త స్టాఫ్‌ను నియమించాలని కూడా అధికారులను ఆదేశించారు.

ఆర్టీసీ లేని రాష్ట్రాలు – ప్రభుత్వమే నడిపిస్తున్న రాష్ట్రాలు

ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ పరిస్థితి చర్చకు వచ్చింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ అనేదే లేదని సీఎం కేసీఆర్ చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌లో ఆర్టీసీ మూతపడింది. అదే విధంగా ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో నామమాత్రపు సర్వీసులతో కొనసాగుతోంది. అయితే మరికొన్ని రాష్ట్రాల్లో స్వయంగా ప్రభుత్వమే ఆర్టీసీని నడిపిస్తోంది. వీటిలో పంజాబ్, హర్యానా, సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్, అండమాన్ నికోబార్ ఈ రాష్ట్రాల్లో ప్రభుత్వమే ఆర్టీసీ సంస్ధను నిర్వహిస్తోంది. ఇటీవల ఏపీ కూడ ఆర్టీసీని విలీనం చేసుకుంది. వీటన్నిలో ఉత్తమ సర్వీసులను అందించే వాటిలో కర్నాటక, ఏపీఎస్ఆర్టీసీ, ఉత్తరప్రదేశ్,టీఎస్ఆర్టీసీ నిలిచాయి.

ఆర్టీసీ నష్టాలకు కారణాలేంటీ?

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన ప్రతిసారి నష్టాల్లో ఉన్న సంస్ధను ఆదుకోవాలనే డిమాండ్ చేస్తుంటారు. అసలు సంస్ధ నష్టాలకు కారణం ఎవరు? అనే ప్రశ్న వస్తుంది. అది కూడా చూద్దాం. ఉత్తమ సర్వీసులను అందించే సంస్ధగా దాదాపు కోటి మందిని ప్రతిరోజు తమ గమ్యస్ధానాలకు సురక్షితంగా చేర్చుతున్న ఆర్టీసీ నష్టాలకు ప్రధాన కారణం ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే. విచిత్రమై విషయమేంటంటే గత నాలుగేళ్లలో మోటార్ వెహికల్ ట్యాక్స్ కింది చెల్లించిన ట్యాక్స్ మొత్తం రూ.816 కోట్లు. అలాగే బస్సుల నడవడానికి కావాల్సిన డీజిల్‌పై చెల్లిస్తున్న వ్యాట్, ఎక్సైజ్ సుంకం ప్రతి ఏటా రూ.590 కోట్లు. ఇన్ని కోట్లలో రాష్ట్రానికి వచ్చేది రూ.200 కోట్లు. ఏటా పెరుగుతున్న డీజిల్ ధరతో ఆర్టీసీకి రూ. కోటీ 80 లక్షల భారం పడుతోంది. ఇక వివిధ రకాల బస్ పాస్‌ల రాయితీల వల్ల ప్రభుత్వమే తిరిగి సంస్ధకు రూ.2,200 కోట్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం రూ. 500 కోట్లు ఇచ్చింది. ఇంకా రూ.1700 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రైల్వేలకు డీజీల్ కమిషన్ ఇస్తున్నట్టుగానే ఆర్టీసీకి కూడా ఎందుకు ఇవ్వరూ అనే ప్రశ్నకు సమాధానం లేదు. అదే విధంగా ఆర్టీసీకి ఉన్న ఆస్తులను ఆర్దిక ప్రయోజనాలకోసం వినియోగించడంలో విఫలం కావడం కూడా నష్టాలకు మరో కారణంగా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం రీ ఎంబర్స్‌మెంట్ చేస్తే అప్పులుల 3వేల కోట్లనుంచి రూ. 1,300 కోట్లకు తగ్గే ఛాన్స్ ఉంది.

ప్రజా రవాణా సాధనమైన ఆర్టీసీ బస్సు రోడ్డుమీదికి రావాలంటే ఎన్నో సమస్యలున్నాయి.వాటన్నిటినీ అధిగమించి ఇప్పటివరకు సర్వీస్ అందిస్తోంది సంస్ధ. అయితే ప్రభుత్వాలే ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించాల్సి అవసరం ఉందంటున్నారు నిపుణులు. బెంగళూరు ఐఐటీ సిఫార్సుల ప్రకారం నష్టాలు వచ్చే గ్రామీణ రూట్లలో పన్నులను రద్దుచేస్తే ఆర్టీసీకి కొంతలో కొంత ఉపశమనం కలిగే వీలుదని చెబుతున్నాయి. ప్రజలకు సేవ చేస్తున్న వాటిపై తిరిగి ప్రభుత్వమే పన్నులు వసూలు చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఆర్టీసీ సమ్మెను విరమిస్తుందా? లేక పోరాటాన్ని కొనసాగిస్తుందా? అలాగే సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టుగా మూడు రకాల వ్యూహాలతోనే ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది.