జలమయమైన హైదరాబాద్ రోడ్లు.. పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్ మహానగరాన్ని వర్ష బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాద్ లింక్ ఉన్న జాతీయ రహదారులతో పాటు నగరంలోని ప్రధాన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి
హైదరాబాద్ మహానగరాన్ని వర్ష బీభత్సం సృష్టిస్తోంది. హైదరాబాద్ లింక్ ఉన్న జాతీయ రహదారులతో పాటు నగరంలోని ప్రధాన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రహదారులపై వర్షపు నీరు ఇంకా ప్రవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వాహనాల రాకపోకలు తక్కువగా ఉన్నప్పటికీ అడుగు కూడా కదలలేని పరిస్థితి. దీంతో గ్రేటర్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మళ్లీస్తున్నారు. పలు చోట్ల ఆంక్షలు విధించారు. హైదరాబాద్-కర్నూలు హైవే తెగడంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారు.. ఓఆర్ఆర్‌పై నుంచే వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు టోలిచౌకి ప్లైఓవర్ వాడొద్దని చెప్పారు. దీనికి బదులు సెవెన్ టోంబ్స్ నుంచి వెళ్లాలని ప్రయాణీకులను పోలీసులు కోరారు. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డును పూర్తిగా మూసి వేశారు. ఇక్కడి నుంచే వెళ్లే వాహనాలను కార్వాన్ నుంచి మళ్లిస్తున్నారు.
అటు మలక్‌పేట్ ఆర్‌యూబీ రోడ్ బ్లాక్ అయ్యింది. దీంతో ఈ మార్గాన వచ్చే వాహనాలు ఇతర ప్రత్యామ్నాయ దారుల గుండా వెళ్లాలని సూచించారు. మూసీ ఉప్పొంగడంతో మూసారాంబాగ్ బ్రిడ్డి దగ్గర ట్రాఫిక్ ను మళ్లించారు. ఇటు వైపు రావొద్దని పోలీసులు వాహనదారులకు సూచించారు. మలక్‌పేట్ వద్ద నాలా పొంగడంతో మలక్‌పేట్-ఎల్బీనగర్ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయారు. అటు ఉప్పల్ ప్రాంతంలో రహదారిపై వరదా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో వరంగల్ వైపు వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇటు విజయవాడ – హైదరాబాద్ రహదారి పూర్తిగా స్తంభించింపోయింది. అయితే, అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజన్ కుమార్ సూచించారు.