
కర్నూలు జిల్లాలో యువ చైతన్యం వెళ్లి విరిసింది. ఏపీలో అగ్రస్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. యువకులు ఓటు హక్కును తొలిసారిగా అత్యధిక స్థాయిలో పొందినది కర్నూలు జిల్లా వాసులే. గతంతో పోలిస్తే ఈసారి దాదాపు 70 శాతం అధికంగా ఉండటం యువకుల్లో పెరిగిన చైతన్యానికి, ఓటు హక్కు పట్ల ఆసక్తికి నిదర్శనంగా భావిస్తున్నారు. యువకులు కొత్తగా ఓటు హక్కు వినియోగించుకున్న జాబితాలో కర్నూలు అగ్రస్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే 70 శాతం మంది యువకులు అధికంగా ఓటు హక్కు కొత్తగా పొందారు. 2023లో 13,474 మంది యువకులు ఓటు హక్కును పొందగా ఈ ఏడాది 44 273 మంది యువకులు కొత్తగా ఓటరు జాబితాలో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. అంటే దాదాపు గత ఏడాదితో పోలిస్తే 30,799 మంది ఓటర్లు అధికంగా ఓటు హక్కు పొందినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
అత్యధికంగా పాణ్యం నియోజకవర్గంలో 7618 మంది యువకులు కొత్తగా ఓటు హక్కు పొందగా.. అతి తక్కువగా ఆదోనిలో 4815 మంది యువకులు ఓటు హక్కు పొందారు. 18, 19 ఏళ్లు నిండిన యువకులను ఓటర్లుగా నమోదు చేయాలనే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ “సిస్టమేటిక్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం” కి శ్రీకారం చుట్టింది.
స్పెషల్ సమ్మరీ 2024 లో భాగంగా ఎన్నికల అధికారులు విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి యువతను ఓటర్లుగా చేర్పించడంలో సక్సెస్ అయినట్లు, తద్వారా ఏపీలో అగ్రస్థానంలో నిలిచినట్లుగా భావిస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడం ద్వారా కూడా యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. యువ ఓటర్ల సంఖ్య పెరిగితేనే రాజకీయాలకు కొత్త ఊపు వస్తుందని, కొత్త దనం వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా నేడు కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..