కొడుకుల‌కు కోటి చొప్పున‌ ఆస్తులు పంచాడు : ఆపై రోడ్డున ప‌డ్డాడు

కొడుకుల‌కు కోటి చొప్పున‌ ఆస్తులు పంచాడు : ఆపై రోడ్డున ప‌డ్డాడు

మాన‌వ సంబంధాలు ఇప్పుడు డ‌బ్బు చుట్టూ తిరుగుతున్నాయి. త‌న, మ‌న బేధాలు లేవు. డ‌బ్బు కోసంఏం చెయ్య‌డానికైనా వెన‌కాడ‌టం లేదు జనాలు.

Ram Naramaneni

|

Aug 08, 2020 | 5:28 PM

Sons arrested for not taking care of father : మాన‌వ సంబంధాలు ఇప్పుడు డ‌బ్బు చుట్టూ తిరుగుతున్నాయి. త‌న, మ‌న బేధాలు లేవు. డ‌బ్బు కోసం ఏం చెయ్య‌డానికైనా వెన‌కాడ‌టం లేదు జనాలు. తాజాగా రూ. 3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా కూడా, తండ్రిని క‌నీసం ప‌ట్టించుకోకుండా న‌డి బ‌జారులో వ‌దిలేశారు కొడుకులు. అంద‌రి మ‌నుసులు క‌దిలించిన ఈ ఘ‌ట‌న‌పై వీఆర్వో ఫిర్యాదు చేయ‌గా..కోహెడ పోలీసులు వెంట‌నే స్పందించారు. తండ్రిపై క‌నీసం మాన‌వ‌త్వం చూప‌ని ముగ్గ‌రు కొడుకులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచగా..ఆయ‌న‌ రిమాండ్ విధించారు. ప్ర‌స్తుతం ఆ గొప్ప త‌న‌యులు చ‌ర‌సాల్లో చిప్పకూడు తింటున్నారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శంకర్‌నగర్‌కు చెందిన పోతు మల్లయ్యకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారి పేర్లు రవీందర్‌, జనార్దన్‌, సుధాక‌ర్‌. తండ్రి మల్లయ్య ముగ్గురు కొడుకుల‌కి ఒక్కొక్క‌రి రూ.కోటి చొప్పున ఆస్తి పంచి ఇచ్చాడు. తండ్రి ఆస్తిని పంచుకున్న కొడుకులు ఆయనను మాత్రం ప‌ట్టించుకోవ‌డం మానేశారు. ఒక్కొక్కరికి కోటి రూపాయల సొత్తు ఇచ్చినా , తండ్రిని ఒక ముద్ద కూడా పెట్ట‌డానికి వారి ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. మల్లయ్య పరిస్థితి చూసి మ‌న‌సు క‌రిగిన గ్రామ పెద్దలు… ఆ ముగ్గురు కొడుకులకు పిలిచి నచ్చ‌జెప్పినా కూడా మార్పు రాలేదు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో చ‌ల‌నం రాలేదు. దీంతో మల్లయ్య సంవ‌త్స‌ర కాలంగా గ్రామ ప్రజలు పెట్టింది తింటూ జీవ‌నం సాగిస్తున్నాడు.

ఇక చేసేది లేక ‌నెలరోజుల క్రితం కోహెడ ఎస్‌ఐ రాజకుమార్‌, గ్రామపెద్దలతో కలిసి మల్లయ్యను అంకిరెడ్డిపల్లి గ్రామ ప‌రిధిలోని వృద్ధాశ్రమంలో చేర్పించారు. అక్కడ చేరిన తరువాత ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో ఆశ్రమ నిర్వాహకులు మల్లయ్యను సిద్దిపేట గ‌వ‌ర్న‌మెంట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నాలుగు రోజులుగా చావుతో పోరాడుతున్నాడు మల్లయ్య. దీని గురించి కుమారుల‌కు ఎస్ఐ సమాచారం ఇచ్చారు. అయినా ఒక్కరూ కూడా ఆసుపత్రి వైపు చూడ‌లేదు. తండ్రిని ఎలా ఉన్నాడో అన్న ధ్యాసే లేదు. దీంతో కన్నతండ్రిని పట్టించుకోని కుమారులపై శనిగరం వీఆర్వో పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ ఆ ముగ్గురు కుమారులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి హుస్నాబాద్‌ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ముగ్గురికి రిమాండ్ విధించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర క‌ల‌కలం రేపింది.

Also Read : గుంటూరు జిల్లాలో పెళ్లైన 24 గంటల్లోపే నవ వధువు మరణం : కార‌ణం ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu