గుజరాత్ తీరంలో తెలుగోళ్ళు.. గోస చెప్ప తరమా?
లాక్ డౌన్ సమయంలో దేశంలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి వారో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. సొంతూళ్ళకు వెళ్ళలేక, వున్న చోట వుండి సంపాదించుకోలేక, గ్రామాల్లోని తమ వారు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఏమీ చేయలేక తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. మోదీ ప్రభుత్వం వలస కూలీలకు...

లాక్ డౌన్ సమయంలో దేశంలో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి వారో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. సొంతూళ్ళకు వెళ్ళలేక, వున్న చోట వుండి సంపాదించుకోలేక, గ్రామాల్లోని తమ వారు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఏమీ చేయలేక తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. మోదీ ప్రభుత్వం వలస కూలీలకు అన్న, వసతులు కల్పించాలని రాష్ట్రాలకు ప్రతీ రోజు సూచిస్తోంది. హోం మంత్రి అమిత్‌షా నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విపత్తు నిధి నుంచి నిధులు వినియోగించుకుని వలస కూలీలను, వారి కుటుంబాలను ఆదుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. అయినా వలస బతుకుల దీనగాథలు ప్రతీ రోజు వెలుగులోకి వస్తూనే వున్నాయి.
ఈ క్రమంలో గుజరాత్ తీరంలో చిక్కుకుపోయి ఉత్తరాంధ్ర వాసులకు తీరని వేదన వెలుగు చూసింది. లాక్‌డౌన్ పొడిగింపుతో కదల్లేని స్థితిలో వలస మత్స్యకారులు వుండిపోయిన దృశ్యాలు తెలుగు మీడియాకు చేరాయి. దుర్భర స్థితిలో జీవిస్తున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులు పరిస్థితి కళ్ళకు కట్టింది. తమను స్వస్థలాలకు తరలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుజరాత్ తీరంలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు వేడుకుంటున్నారు.
రోడ్డు మార్గం ద్వారా వీలు కాకపోతే సముద్ర మార్గం ద్వారానైనా తమను తమ స్వస్థలాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడే ఉన్న మహారాష్ట్ర మత్స్యకారులను జెట్టీల్లో తరలించారని వారు తెలిపారు. తీరం వెంబడి వున్న మురుగు నీటి మధ్య బోట్లలో దుర్బర జీవితాన్ని గడుపుతున్నామని, అందుకు సంబంధించిన వీడియోలను తెలుగు మీడియాకు పంపారు. ఏపీ రెవెన్యూ అధికారులు వచ్చి, తమ పరిస్థితిని చూసి వెళ్లారు తప్ప ఏ సహాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా జోక్యం చేసుకుని తమను తమ స్వస్థలాలకు తరలించాలని అభ్యర్థిస్తున్నారు.




