ములుగు ఎఫ్‌సీఆర్‌ఐకి ఎ ప్లస్ కేటగిరి
తెలంగాణ అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(FCRI)కి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఆ కాలేజీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎ్‌ఫఆర్‌ఈ) ఎ ప్లస్ కేటగిరి విద్యాసంస్థగా గుర్తింపు ఇచ్చింది.

రాష్ట్రంలోని మరో కాలేజీకి జాతీయ స్థాయి హోదా దక్కింది. తెలంగాణ అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ(FCRI)కి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఆ కాలేజీకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్(ఐసీఎ్‌ఫఆర్‌ఈ) ఎ ప్లస్ కేటగిరి విద్యాసంస్థగా గుర్తింపు ఇచ్చింది. అటవీ విద్య, బోధన, పరిశోధనలో అత్యున్నత ప్రమాణాలను ఎఫ్‌సీఆర్‌ఐ పాటిస్తున్నదని వెల్లడించింది. దేశంలోని అటవీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, వసతులను అధ్యయనం చేసిన ఐసీఎ్‌ఫఆర్‌ఐ.. సిద్దిపేట జిల్లా ములుగులోని ఎఫ్‌సీఆర్‌ఐకి ఈ గుర్తింపు ఇచ్చింది. అటవీ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం శుభ పరిణామమని, రాష్ట్ర ప్రభుత్వ కృషికి ఫలితం లభించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఉన్నతాధికారులు, కాలేజీ యాజమాన్యం, విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణం, పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ ఆడవులపై పరిశోధనలకు ప్రత్యేక అటవీకళాశాలను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. తమిళనాడు మెట్టుపలాయం అటవీ కాలేజీకి దీటుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ శివారు దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో 2015లో ఎఫ్‌సీఆర్‌ఐని ఏర్పాటు చేశారు. 2016-17 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్ల కోర్సు ప్రారంభమైంది. కాగా, విద్యా సంవత్సరం 2020-21 నుంచి రెండేళ్ల ఎమ్మెస్సీతో పాటు మూడేళ్ల పీహెచ్‌డీ కోర్సులను ఎఫ్‌సీఆర్‌ఐ ప్రారంభిస్తోంది. అటవీ బోధనలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ మరింత లోతైన పరిశోధనల కోసం వివిధ దేశాలకు చెందిన యూనివర్సిటీలతో ఎఫ్‌సీఆర్‌ఐ ఒప్పందాలు కుదుర్చుకుంది.




